మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు :సీపీఎం నేత వీరయ్య ఫైర్

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు :సీపీఎం నేత వీరయ్య ఫైర్
  •     ఆర్ఎస్​ఎస్, బీజేపీపై సీపీఎం నేత వీరయ్య ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీలు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నాయని.. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటం వార్షికోత్సవాల సందర్భంగా గురువారం మగ్ధూం మొహియుద్దీన్ విగ్రహం నుంచి సుందరయ్య విగ్రహం బాగ్ లింగంపల్లి వరకు సీపీఎం ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు.

 ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.." నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడారు. తెలంగాణ ప్రాంతంలో వేల ఎకరాల భూములను కమ్యూనిస్టులే  పేదలకు పంచారు. స్వాతంత్ర్య పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలతో  ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఎలాంటి సంబంధం లేదు" అని వీరయ్య పేర్కొన్నారు. కాగా.. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.

నిజాం కాలం నాటి ప్రజల దుర్భర పరిస్థితులను కళ్లకద్దినట్టు ఫొటో ఎగ్జిబిషన్​ చిత్రాల్లో చూపించారన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింహారావు, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.