- క్షుద్రపూజలతో చంపేస్తున్నారని ఒకరిపై గిరిజనుల దాడి
- బాధితుడిని రక్షించేందుకు వచ్చిన పోలీసులపైనా ఎటాక్
- రెండు వాహనాలు ధ్వంసం ,ఏఎస్ఐ గంగాధర్‌కు గాయాలు,
- లాఠీచార్జి చేసిన పోలీసులు
నిజామాబాద్/ మాక్లూర్, వెలుగు: నిజామాబాద్శివారులోని మాక్లూర్ మండలం మాణిక్బండార్తండాలో గురువారం రాత్రి శ్మశానవాటికలో క్షుద్ర పూజల వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. తండావాసులు అనారోగ్యంతో చనిపోవడానికి క్షుద్రపూజలు చేసే వ్యక్తే కారణమని అతడిని చావగొట్టారు. కాపాడడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఏఎస్ఐ గాయపడ్డాడు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మాణిక్‌బండార్ గ్రామానికి చెందిన లక్కంపల్లి అర్వింద్ మంత్రాలు చేస్తాడనే ప్రచారముంది. ఆర్మూర్‌కు చెందిన ఓ మతస్థులు 12 మంది తమ అనారోగ్య సమస్యను వివరించగా, రాత్రి 10 గంటల తర్వాత శ్మశానవాటికలో మేకపోతును బలిచ్చి, క్షుద్రపూజ చేస్తే నయమవుతుందని సలహా చెప్పాడు. దీంతో వారంతా మాణిక్బండార్తండా శ్మశానవాటికకు రాగా, అర్వింద్పూజలు చేశాడు.
కొందరు తండా యువకులు వచ్చి చూడగా బలిచ్చిన మేకపోతుతో పాటు పక్కనే పూజలు చేసిన ఆనవాళ్లుండడంతో మరికొందరు గిరిజనులను పిలిచారు. మూడు నెలల నుంచి 15 మంది తండావాసులు చనిపోవడానికి అర్వింద్మంత్రాలు చేయడమే కారణమంటూ అతడిని కొడుతూ తండాకు లాక్కెళ్లారు. ఇతర మతస్తులను కూడా తీసుకువచ్చి కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ గంగాధర్ రెండు వాహనాల్లో కానిస్టేబుల్స్‌తో రాత్రి 11 గంటలకు అక్కడికి వచ్చారు. తీవ్రంగా గాయపడిన అర్వింద్‌ను వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్తుండగా గిరిజనులు అడ్డుకొని రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ఏఎస్ఐ గంగాధర్ తలకు, కన్ను వద్ద రాళ్లు తగలడంతో గాయపడ్డారు. పరిస్థితిని కంట్రోల్చేసేందుకు లాఠీ చార్జ్ చేయగా కొందరు గిరిజనులు గాయపడ్డారు. అదనపు బలగాలు వచ్చి అర్వింద్‌తో పాటు ఏఎస్ఐ గంగాధర్‌ను జీజీహెచ్హాస్పిటల్కు తరలించాయి. సీసీఎస్ ఏసీపీ విజయసారథి, సీఐలు సతీశ్, నరహరి, ఎస్ఐలు సుధీర్‌రావు, యాదగిరి గౌడ్ తండాను విజిట్ చేశారు.