భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..చెరువుల్లో రియల్​ దందా!

  •      భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చెరువుల శిఖం భూముల ఆక్రమణ
  •     ఎకరాల కొద్దీ కబ్జా.. కలెక్టర్​కు అందుతున్న ఫిర్యాదులు 
  •     కొన్ని చెరువులపై కొనసాగుతున్న సర్వే
  •     ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారనే ఆరోపణలు!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చాలా వరకు చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. తప్పుడు డాక్యుమెంట్లతో చెరువులు, చెరువు శిఖం భూముల్లో పాగా వేసి ప్లాట్లు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.  ఈ పరిస్థితి ఎక్కువగా పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో ఉంది. 

ఇదీ పరిస్థితి.. 

  • జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా ఉన్న పాల్వంచ పట్టణం నడిబొడ్డున, కలెక్టరేట్​కు కూత వేటు దూరంలోని చింతల చెరువును కబ్జాదారులు దశలవారీగా ఆక్రమిస్తున్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు కబ్జాదారులు ఆక్రమణలు యథేచ్ఛగా సాగించారు. దాదాపు 98.30ఎకరాల్లో చింతల చెరువు విస్తరించి ఉంది. అనధికారికంగా మరో ఐదెకరాలు ఉన్నప్పటికీ అదంతా కబ్జాలపాలైంది. అధికారికంగా రికార్డుల్లో ఉన్న చెరువు శిఖం భూములతో పాటు అలుగు ప్రాంతం ఆక్రమణలకు గురవుతోంది. చెరువు పక్క నుంచే నేషనల్​ హైవే ఉండడంతో గజం దాదాపు రూ. 35వేల నుంచి రూ. 45వేల వరకు పలుకుతోంది. ఈ చెరువును మినీ ట్యాంక్​ బండ్​గా డెవలప్​ చేసేందుకు గతేడాది ప్రభుత్వం దాదాపు రూ. 10కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న కబ్జాదారులు మరింత రెచ్చిపోయారు.  దీనిపై  స్థానికులు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సమయంలో ఆక్రమణలకు కొంత అడ్డుకట్టపడినట్లైంది.   చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కలెక్టర్​ ఆదేశించినప్పటికీ సర్వే నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో కబ్జాల పర్వం మళ్లీ కొనసాగుతూనే ఉంది. కొంతమంది అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్లు సైతం చేయించుకుంటున్నారు. 
  • పాల్వంచలోని రాతి చెరువు 35 ఎకరాల మేర విస్తరించి ఉంది. కాగా అధికారిక లెక్కల ప్రకారమే చెరువు శిఖం భూమి దాదాపు నాలుగు ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది. అలాగే మేడికుంట చెరువు శిఖం భూములు కనుమరుగవుతున్నాయి.  
  • చుంచుపల్లి మండలంలోని గొలుసుల మల్లయ్య చెరువు మొత్తాన్ని రియల్​ఎస్టేట్​ వ్యాపారులు ఆక్రమించుకున్నారు. ఈ చెరువును గతంలో ఎన్​ఆర్​ఈజేఎస్​ కింద గుర్తించి పనులు చేపట్టారు. కాగా చెరువు రెవెన్యూ రికార్డుల్లో లేదంటూ ఆఫీసర్లు చెపుతుండడంతో కబ్జాదారులకు కలిసొచ్చింది. కాగా ఇరిగేషన్​ అధికారులు మాత్రం అక్కడ చెరువు ఉందని చెపుతుండడం గమనార్హం. కబ్జాదారులు ఇటీవల చెరువు మొత్తాన్ని చదును చేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు కూడా సాగిస్తున్నారు. 
  •     
  • చుంచుపల్లి మండలంలోని చింతల చెరువు శిఖం భూములను కొందరు ఆక్రమించుకున్నారు. చెరువు కట్టకు అతి సమీపంలోనే బహుళ అంతస్థులను నిర్మిస్తున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్టవేయాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు చేపడుతున్నాం

చెరువులలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో చెరువు శిఖం భూముల కబ్జాపై సర్వే చేపడుతున్నాం. పాల్వంచ మండలంలో కొన్ని ఆక్రమణలను ఇటీవల తొలగించాం. చుంచుపల్లి మండలంలోని గొలుసుల మల్లయ్య చెరువు ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి ఆక్రమణలను అడ్డుకుంటాం. 

అర్జున్, ఈఈ, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్