బోర్డు పెట్టారో..ల్యాండ్​ గోవిందా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు ఇది ప్రభుత్వ భూమి దీన్ని ఆక్రమించడం నేరమని ఆఫీసర్లు బోర్డులు పెట్టిన సర్కార్​ ల్యాండ్ల పైనే కబ్జాదారులు గురిపెడ్తున్నారు. అధికారం అండతో కొందరు, ఆఫీసర్లను గుప్పెట్లో పెట్టుకొని మరికొందరు ఇలా దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్తూ అధికారులు తప్పించుకుంటున్నారు.

విలువైన భూములకు ఎసరు

 జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో సర్కార్​భూములను అడ్డూఅదుపు లేకుండా ఆక్రమించుకొని, అమ్ముకుంటున్నారు. కొత్తగూడెంలోని 141,142,143 సర్వే నెంబర్లలోని రూ. కోట్ల విలువైన ప్రభుత్వ, సింగరేణి భూములు కబ్జాలకు గురవుతున్నాయి. పట్టణంలోని మేదరబస్తీలోని 16,18వ వార్డుల్లో దాదాపు రూ.కోటికి పైగా విలువైన ప్రభుత్వ భూమిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు బోర్డు పెట్టారు. 

కొద్దిరోజుల తర్వాత ఆ బోర్డు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక కౌన్సిలర్​విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పట్టణంలోని బూడిదగడ్డ, బర్మా క్యాంప్​ఏరియాల్లో బోర్డులు పెట్టిన వాటిని తొలగించి కబ్జా చేసి, ప్లాట్లు చేస్తున్నారు. పాత కొత్తగూడెంలో ఏడాది కిందట ఆఫీసర్లు దాదాపు వందకు పైగా బోర్డులు పాతారు. ప్రస్తుతం పదిలోపే బోర్డులు ఉండడం విశేషం. పట్టణంతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో ఆక్రమణ దారులు అధికార పార్టీ లీడర్ల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి సర్కార్​భూములను కాజేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రగతినగర్​లో రూ.కోట్ల విలువైన ఇదే రకంగా తప్పుడు పత్రాలతో ఆక్రమించారు. సర్కార్​భూమి అని పెట్టిన బోర్డులు మాయమవుతున్నా ఆఫీసర్లు దృష్టి సారించకపోవడం గమనార్హం. 

రక్షణ చర్యలు చేపడుతాం..

ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్​వేసి రక్షణ చర్యలు చేపడుతున్నాం. గతంలో అధికారులు ఎక్కడెక్కడ బోర్డులు పెట్టారో, అవి ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఆక్రమణలకు గురైన విషయం మా దృష్టికి తీసుకొస్తే, పరిశీలించి చర్యలు చేపడతాం. మున్సిపల్​ఆఫీసర్లతో కలిసి పట్టణంలో పలు సర్కార్​భూములకు ఫెన్సింగ్​వేశాం. మేదరబస్తీలో ల్యాండ్​కబ్జా మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ భూముల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం.
– శర్మ, తహసీల్దార్, కొత్తగూడెం