కాజీపేట, వెలుగు : ఓ వ్యక్తి దహన సంస్కారాలు ప్రభుత్వ భూమిలో జరగకుండా కబ్జాదారులు అడ్డుకునేందుకు యత్నించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా, బట్టుపల్లి శివారులో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాజీపేట దర్గాకు చెందిన ఒక వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దర్గా ఇందిరమ్మ కాలనీలో ఇల్లు నిర్మించుకొని ఉండేవాడు.
అతని అంత్యక్రియలను కుటుంబ సభ్యులు దర్గా ఇందిరమ్మ కాలనీ పక్కన గల ప్రభుత్వ భూమిలో నిర్వహించేందుకు వస్తుండగా బట్టుపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఇది తమ పట్టా భూమి అని, అందులో దహన సంస్కారాలు చేయవద్దని గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం అదే భూమిలో దహన సంస్కారాలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఇందిరమ్మ కాలనీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 299 సర్వే నంబర్ లో 48 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టింది. ఆ భూమిలో కొందరు ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. కొందరు పైసలు లేక ఇండలు కట్టుకోలేదు. ఇలా ఖాళీగా ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించారు. అప్పుడు డబ్బులు లేక ఇల్లు నిర్మించుకోలేకపోయామని, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటామని వస్తే కబ్జాదారులు తమను రానివ్వకుండా గొడవలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.