అవసరాల కోసం ఇచ్చిన వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆగం

అవసరాల కోసం ఇచ్చిన వేల ఎకరాల ప్రభుత్వ  భూములు ఆగం
  • కబ్జా.. లేదంటే పడావు  
  • వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కార్​
  • గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు దాదాపు  1.72 లక్షల ఎకరాలు కేటాయింపు
  • అందులో యథేచ్ఛగా వెలసిన ప్రైవేటు నిర్మాణాలు.. సగానికిపైగా భూములు ఖాళీ
  • వినియోగించని భూములను భవిష్యత్​ అవసరాలకు వాడే ఆలోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: వివిధ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాలపాలయ్యాయి.. కొన్నేమో పడావు పడ్డాయి. పేరుకు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వందల ఎకరాల భూములు తీసుకొని.. వాటిలో సగం వరకు ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. ఇలాంటి ల్యాండ్స్​ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. అసలు ఎన్ని ఎకరాల భూములను ఎవరెవరికి ఏయే సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయి?  వాటి పరిస్థితి ఏమిటి? ఏ ప్రయోజనాలకైతే ప్రభుత్వం నుంచి ల్యాండ్స్​ పొందారో.. ఆ మేరకు వాటిని వినియోగిస్తున్నరా.. లేదా.. అనేది తెలుసుకుంటున్నది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములతోపాటు  ప్రైవేట్​ కంపెనీలకు ఇచ్చిన ల్యాండ్స్​ వివరాలనూ సేకరిస్తున్నది. ఈ మేరకు స్టేటస్​ రిపోర్ట్​ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. 

అయితే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, శాఖలకు  కేటాయించగా.. అందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నట్లు, వందల ఎకరాలు కబ్జాల పాలైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ శాఖల కింద పడావుగా ఉన్న  ప్రభుత్వ భూములు ఇతరులు కబ్జాలు చేస్తుండటంతో.. ప్రభుత్వమే వాటిపై విధానపర నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్​ అవసరాలకు వాటిని వినియోగించేలా డెవలప్​ చేయాలని ఆలోచిస్తున్నది. 

సీపీఎస్​యూల్లో ఇదీ పరిస్థితి!

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌‌‌‌‌‌‌‌యూలు), పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఇతర శాఖలకు గతంలో కేటాయించిన భూముల్లో చాలా విస్తీర్ణం వినియోగంలో లేనట్లు తెలిసింది. కొన్ని మొత్తానికే మూతపడగా.. మరికొన్ని ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అన్న విధంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న సర్కార్​ భూముల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపయోగంగా ఉన్న ఆ భూములను ఇంకో రకంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. 

ఎంత అవసరమో అంతవరకే ఉంచి మిగతా వాటిని వెనక్కి తీసుకోవడమా? లేక ఇంకో రకంగా వినియోగించుకుని డెవలప్​మెంట్​ చేయడమా?.. అనే దానిపై కసరత్తు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మొత్తం11 సంస్థల కింద  దాదాపు 13 వేల ఎకరాలు భూమి ఉంది. అయితే ఇందులో మూడు సీపీఎస్​యూలు ప్రస్తుతం నాన్ ఫంక్షనల్​గా ఉన్నాయి. ఈ భూములను గతంలో ఇండస్ట్రీల కోసమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే కేటాయించాయి. పైగా ఇప్పుడు నాన్ ఫంక్షనల్ గా ఉన్నాయి.

  ఇందులో ఆదిలాబాద్  సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో దాదాపు 2,290 ఎకరాలు ఉండగా.. ఇందులో 773 ఎకరాల్లో నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 1,500 ఎకరాల భూమి పడావుగా ఉంది. హైదరాబాద్ లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కూడా నాన్ ఫంక్షనల్ గా ఉన్నది.

దీనికింద 891 ఎకరాలు ఉండగా.. 543 ఎకరాలు మాత్రమే వాడకంలో ఉంది. కుత్బుల్లాపూర్ లోని హిందుస్థాన్ మిషన్​ టూల్స్(హెచ్ఎంటీ) కింద ఇంకో 123 ఎకరాల భూమి ఉంది. ఇందులో 50 ఎకరాలు మాత్రమే యుటిలైజ్ లో ఉంది. ఈ సంస్థ కూడా నాన్​ ఫంక్షనల్​గా ఉంది. ఇవికాకుండా  ఫంక్షనల్​లో ఉన్న 8 సీపీఎస్​యూల కింద 8,948 ఎకరాల భూములు ఉన్నట్లు తేలింది. ఇందులో 2,313 ఎకరాలు మాత్రమే యుటిలైజేషన్ లో ఉండగా.. మిగిలిన 6,635 ఎకరాలు పడావు ఉంది.  

వీటిలో మిథాని, ధాతు నిగం లిమిటెడ్, డీఆర్డీవో, బీడీఎల్ సంస్థల కింద 1,500 ఎకరాలు ఉండగా.. 188 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. అలాగే మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 3,500 ఎకరాలు ఉండగా.. 1,500 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. లింగంపల్లిలోని భెల్ కంపెనీకి 2,350 ఎకరాలు ఉండగా, 225 ఎకరాలు.. చర్లపల్లిలోని ఈసీఐఎల్ కు 1,200 ఎకరాలకు గాను 270 ఎకరాలు.. హెచ్ఏఎల్ కు 314 ఎకరాలకు గాను 100 ఎకరాలు.. చాంద్రాయణగుట్ట డీఆర్డీవో అండ్ డీఆర్డీఎల్ కు 85 ఎకరాలకు గాను 30 ఎకరాలు వాడకంలో  ఉంది.

గతంలో రాష్ట్రం కేటాయించిన కొన్ని భూముల వివరాలు..

  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు    13,000 ఎకరాలు
  • రాష్ట్ర ప్రభుత్వ భవనాలు     27,607 ఎకరాలు
  • కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు    16,879 ఎకరాలు
  • భూదాన్​ బోర్డు    3,674 ఎకరాలు
  • స్థానిక సంస్థలు    3,550 ఎకరాలు
  • హౌసింగ్​ బోర్డు    3,337 ఎకరాలు
  • వ్యవసాయ మార్కెట్లు    1,886 ఎకరాలు

పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్స్​ పరిస్థితి ఏమిటి?

పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు 65 వేల ఎకరాల వరకు కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో  కొంత భాగం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలినవి ఖాళీగా లేదా కబ్జాల్లో ఉందని తేలింది. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో చెప్పిన పరిశ్రమలనే పెట్టారా? ఇంకా ఇతర యాక్టివిటీస్​  నిర్వహిస్తున్నరా? అనేది ప్రభుత్వం తేల్చేందుకు సిద్ధమైంది.  సర్వే చేయించి.. అసలు ఎక్కడ ఎంత ల్యాండ్​ ఉందో పక్కా లెక్కలు తీయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. 

ఎవరూ పట్టించుకోక 

గతంలో ప్రభుత్వాలు కేటాయించిన భూముల్లో వెలసిన కబ్జాలు పెద్ద సవాల్​గా మారాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిటెడ్​ కేసుల్లో దాదాపు 2,500 ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 10 వేల కోట్లకు పైమాటే. ఈ భూములు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నాయి.  అయితే ఇవి అధికారికంగా నమోదు చేసినవి మాత్రమే కావడం గమనార్హం. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల కింద పెట్టిన సర్కార్​ భూములు వేల ఎకరాల్లో కబ్జాలకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇట్ల దాదాపు
20 వేల ఎకరాలపైనే ఉంది.