శామిర్ పేట్: మంత్రిమల్లారెడ్డి తమ భూములు ఆక్రమించాడని మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంగ్రామ గిరిజనలు ఆందోళనకు దిగారు. కేశవరంలోని సర్వే నెంబర్ 33,34,35లో గల సుమారు 47 ఎకరాల 18 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డితో పాటు కొంతమంది బీఆర్ ఎస్ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గిరిజనలు ఆరోపించారు. తోట గేట్ ముందు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు.. తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు.
బాధితులు మాట్లాడుతూ.. గంగారాం అనే గిరిజనుడు 50 ఏళ్ల నుంచి భూమిని సాగు చేస్తుండేవారని.. గంగారాంకు 10 మంది కొడుకులు ఉండగా అందులో 9మంది చనిపోయారు.. మిగిలిన బిక్షపతి కొన్ని కారణాల చేత బతుకు దెరువుకోసం వివిధ ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. ఇటీవల బిక్షపతికి మాయమాటలు చెప్పి కోట్ల విలువైన భూమిని 2 లక్షలు ఇచ్చి రూ. 150 కోట్ల విలువైన 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. తర్వాత వచ్చి మరొకొంత డబ్బు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డి గిరిజనులను మోసం చేశారని.. సుమారు 150 కోట్ల విలువైన భూమని ఆక్రమించుకొని గిరిజనుల బతుకులు ఆగం చేశాడని మండిపడ్డారు. తమకు ఇస్తామన్న డబ్బులు ఇప్పించాలని లేదంటే.. గిరిజనులు మొత్తం మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.