అయోధ్య అనగానే రాముడు గుర్తొస్తాడు అందరికీ. అయితే మధ్య ప్రదేశ్‌లో ఓచా అన్నా కూడా రాముడే గుర్తొస్తాడు.ఎందుకంటే ఆ ఊరికి రాముడే రాజు. అక్కడి ప్రజలకు ఆయనే దేవుడు. బెత్వా నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో నిత్యం రామనామ స్మరణతో విలసిల్లే ప్రాంతం ఓచా. ఒక్క మాటలో చెప్పాలంటే... ఓచాని మరో అయోధ్య అనొచ్చు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పాపులర్ హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ ఓచా. దీన్ని చూడ్డానికి ఏటా వేలమంది టూరిస్టులు వెళ్తుంటారు. రాజధాని భోపాల్ నుంచి ఓచాకు వెళ్లడం చాలా ఈజీ. రాజభవనాలు, కోటలు, దేవాలయాలతో నిండిన ఈ పురాతన పట్టణం రాష్ట్ర రాచరికానికి అద్దం పడుతుంది. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలో ఉన్న ఓచా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి కేవలం15 కిలోమీటర్ల దూరంలో ఉంది.1501లో బుందేల్‌ఖండ్‌ను పాలిస్తున్న రుద్ర ప్రతాప్ సింగ్ దీన్ని నిర్మించాడు. ఓచాను పాలించిన మొదటి రాజు అతనే. 2006లో ఐఐటీ రూర్కీకి చెందిన ఎల్ఐకె టీమ్ ఓచా కట్టడాలను డాక్యుమెంట్ చేసింది. 2008లో ఓచాలో రేడియో బుందేల్‌ఖండ్ పేరుతో రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. అందులో బుందేలీ జానపద సంగీతం, ప్రాంతీయ విషయాలు, కల్చర్, ఎడ్యుకేషన్, ట్రెడిషన్ గురించిన కార్యక్రమాలు చేస్తుంటారు.
రాముడే రాజు
రాముడిని రాజుగా భావించడం వెనక ఒక స్టోరీ ఉంది. పదహారో శతాబ్దంలో అప్పటి రాజు మధుకర్ షా కృష్ణుడి భక్తుడు. ఆయన భార్య రాణి కున్వర్ గణేశ్ రాముడి భక్తురాలు. వాళ్లిద్దరి మధ్య రాముడు, కృష్ణుడికి సంబంధించిన విషయాల్లో బేధాభిప్రాయాలు ఉండేవి. ఒకసారి రాజు రాణితో ‘నిజంగా రాముడు ఉంటే ఓచాకు తీసుకురా’ అని ఒక సవాలు విసిరాడు. అప్పుడు రాణి అయోధ్యకు వెళ్లి 21 రోజులు రాముడిని అమిత భక్తితో ఆరాధించింది. చివరికి రాముడు తన బిడ్డ రూపంలో కనిపించాడట. కానీ ఆమెతో ఓచాకి వెళ్లేందుకు మూడు షరతులు పెట్టాడట. వాటిలో మొదటిది – ఓచాకు రాజుగా నేనే ఉండాలి. ఇంకో రాజు ఉండకూడదు. రెండోది – నన్ను ఎక్కడికైతే తీసుకెళ్తారో ఇకమీదట అక్కడే ఉండిపోతా. మూడోది – సన్యాసులతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు నేను వాళ్లతో కలిసి వెళ్లిపోతా. ఈ మూడు షరతులకు రాణి ఒప్పుకుని తనతోపాటు ఓచాకు రాముడ్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి అక్కడ రాముడే రాజు. ఇప్పటికీ రామరాజ దేవాలయంలో రాముడికి పోలీసుల ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే వి.ఐ.పి., మినిస్టర్ వంటి అధికారులు ఎవరైనా ఓచాకు వెళ్తే సామాన్యుడిలానే ఉండాలి. అంతేకానీ అధికార బలాన్ని చూపించే వీలు లేదు.
అప్పటి వైభవం కనిపిస్తుంది
ఓచా బెత్వా నది ఒడ్డున ఉన్న ఓ పురాతన నగరం. ఇది16వ శతాబ్దానికి చెందిన బుందేలా రాజ్‌పుత్ వంశానికి చెందిన రుద్ర ప్రతాప్ సింగ్ దీన్ని స్థాపించాడు. ఓచా నగరం ఉన్న ప్రాంతం బెత్వా నది ఏడు కాలువలుగా విడిపోయే దగ్గర ఉంది. అక్కడి ప్యాలెస్‌లు, దేవాలయాలు చూస్తుంటే ఒకప్పటి వైభవం కళ్లముందు కట్టినట్టు కనిపిస్తుంది.
ఎంజాయ్ చేయాలంటే ఇవే..
బెత్వా నదిలో కయాకింగ్ : బెత్వాలోని పాపులర్ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ కయాకింగ్. కయాకింగ్ చేస్తూ ఓచా నేచురల్ రిజర్వ్‌కు వెళ్లొచ్చు. రిజర్వ్‌లో విదేశీ పక్షి జాతులను దగ్గరగా చూడొచ్చు.
రివర్ రాఫ్టింగ్ : బెత్వా నది దగ్గర థ్రిల్లింగ్‌గా ఉండే రైడ్‌కి వెళ్లొచ్చు. ఈ నది యమునా నదిలో కలిసే ముందు ఎదురయ్యే ప్రవాహాలు, సడెన్‌గా వచ్చే మలుపుల అడ్వెంచరస్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.
ఓచా కోట
రాజ్, జహంగీర్, రాయ్ ప్రవీణ్ మహల్ అనేవి వేటికవి మూడు అద్భుత కట్టడాలు. బహుళ అంతస్తుల జహంగీర్ మహల్ బాల్కనీల నుంచి చూస్తే నగరం అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఓచా బుందేల రాజుల పరిధిలో ఉన్నప్పటికీ యుద్ధాల తాలూకా ఛాయలు ఈ నగరాన్ని చాలా తక్కువగా తాకాయనే చెప్పొచ్చు.
రామ్ రాజా ఆలయం
హిందూ దేవాలయ నిర్మాణ పద్ధతిలో ఉండే రామ్ రాజా ఆలయంలో పురాతన ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. రామరాజు దేవాలయంలో మాత్రమే రాముడిని దేవుడు, రాజుగా ఆరాధిస్తారు. అక్కడి సంస్కృతి, చరిత్ర తెలుసుకోవాలనుకుంటే.. నది ఒడ్డున కూర్చుని స్థానికులు, టూర్ గైడ్‌లు చెప్పే ప్రసిద్ధ జానపద కథలను వినాలి. ముఖ్యమైన పండుగలప్పుడు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పండుగలప్పుడు ఈ టెంపుల్‌కి వెళ్లాలంటే మాత్రం ముందుగా ప్లాన్ చేసుకోవాలి.
జహంగీర్ మహల్
జహంగీర్ తల్లి మరియమ్ ఉజ్ జమాని. ఆమె రాజపుత్ర యువరాణి. అందుకని ఓచాకు ఈ జహంగీర్ మహల్‌ని కట్టించాడు ఆ రాజు. ఇక్కడ సాయంత్రాలు సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది. ఈ షోలో ఓచా, జహంగీర్ మహల్ చరిత్ర గురించి చెప్తారు.
చతుర్భుజ్ టెంపుల్
చతుర్భుజ్ ఆలయాన్ని ఓచా రాణి కట్టించారు. అలాగే రాజ మందిర్ని ‘రాజ మధుకర్ షా’ కట్టించాడు. ఇది పురాతనమైన కట్టడం. తొమ్మిదో శతాబ్దానికి చెందింది. ఇందులో హిందూ దేవాలయాలన్నింటిలోకెల్లా ఎత్తైన గోపురం ఉంది. దీని ఎత్తు 344 అడుగులు.
ఉతః ఖానా (కేమెల్ షెల్టర్)
ఒంటెలు నివాసం ఉండే ప్రాంతాన్ని ఉతః ఖానా అంటారు. ఇది కోటకు పక్కనే ఉంటుంది. టూరిస్ట్‌లు కేమెల్ షెల్టర్ పైకప్పు మీదకి ఎక్కొచ్చు కూడా. అక్కడి నుంచి చూస్తే ఓచా నగరపు అందాలు కనువిందు చేస్తాయి.ఓచాలో చూడాలంటే చారిత్రక ప్రదేశాలు బోలెడు ఉన్నాయి. ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్, ఛత్రీస్, దౌజీ కి హవేలీ, దిన్మాన్ హర్దౌల్స్ ప్యాలెస్, ఫూల్ బాగ్ వంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ కట్టడాలు ఉన్నాయి. ఇవేకాకుండా రాజా మహల్, రాణి మహల్, సుందర్ మహల్, లక్ష్మీ నారాయణ్ టెంపుల్ఇలా మరెన్నో ఉన్నాయి.
ఇలా వెళ్లాలి
ఓచా వెళ్లాలంటే... ఝాన్సీ, ఓచా మధ్య రోడ్డు జర్నీ చేయొచ్చు. అలాగే, మధ్యప్రదేశ్‌లోని అన్ని ముఖ్య నగరాల నుంచి ఓచాకి చేరుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుంచి ఓచాకు బస్సులు ఉన్నాయి. పొరుగున ఉన్న ప్రాంతాల నుంచి ఓచా వెళ్లాలంటే ఒక ట్యాక్సీని అద్దెకు తీసుకోవడం బెటర్.
ఇతర మార్గాలు
ఓచా నుంచి 16 కి.మీ దూరంలో ఝాన్సీ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి ఓచా వెళ్లేందుకు ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీలు ఉంటాయి. ఝాన్సీ ఎయిర్పోర్ట్ ఓచాకు దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఓచాకి ట్యాక్సీలో వెళ్లొచ్చు. ఓచా అందాలు చూడ్డానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడికి టూర్ వేస్తే మంచి ఎక్స్‌పీరియెన్స్ మీ సొంతం అవుతుంది.