
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈనెల 15న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభ కోసం ఓ దళితరైతు పంటను నాశనం చేశారు. ఎకరం భూమిలో తాను సాగుచేసుకుంటున్న నువ్వుల పంటలో మన్ను పోశారని ఎనగందుల లక్ష్మినారాయణ ఆరోపించాడు.. మరికొద్ది రోజుల్లో చేతికి వచ్చే పంటను ధ్వంసం చేసి తన నోట్లో మట్టికొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేమని అడిగితే దబాయిస్తున్నారని వాపోతున్నాడు. న్యాయం చేయాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. ఇందుకు సభాస్థలం వాస్తు ప్రకారం ఉండాలని సూచించడంతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ రెండుమూడు స్థలాలను పరిశీలించారు. ముందుగా హనుమకొండరోడ్డులోని పోతారం(ఎస్)లో స్థలాన్ని పరిశీలించారు. అక్కడ వాస్తు సరిగా లేదని బస్‌డిపో గ్రౌండును చూశారు. అదీ బాగాలేదని కరీంనగర్ రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద స్థలాన్ని ఎంపికచేశారు. ఆ స్థలంలో ఎకరం నువ్వులపంట ఉన్నా దానిని బ్లేడ్బండ్లతో తొలగించారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడంతో రైతు ఎనగందుల లక్ష్మినారాయణ తీవ్రంగా బాధపడుతున్నాడు.