అక్టోబరు 8న గరుడ సేవ .... తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగనున్నాయి.   శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి అత్యంత ప్రియమైన గరుడసేవ రోజున భారీగా విచ్చేసే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని,  అక్టోబరు 8న టీటీడీ రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిషేధించారు. అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవని టీటీడీ ప్రకటించింది

తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. అక్టోబర్‌ 3న ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళ్లల్లో ఒక్కో వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. 4న సాయంత్రం 5.45 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతంది. బ్రహ్మోత్సవాలకు ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.

ALSO READ | వినాయక చవితి.. ఆకుల పండుగ.. ఏ ఆకుతో పూజిస్తే ఏంటంటే..

ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంగా రుత్వికులు వేదమంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూచుడతారు. ఇక రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. రెండోరోజైన 5న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 వరకు హంస జరుగుతుంది. 6న ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ముత్యపు పందిరి, నాలుగో రోజున ఉదయం కల్పవృక్షం వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవపై శ్రీవారి భక్తులను అనుగ్రహిస్తారు. ఐదోరోజున ఉదయం మెహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహనంపై భక్తకోటిని కటాక్షిస్తారు. ఉత్సవాల్లో ఆరో రోజున ఉదయం హనుమంత వాహనసేవ, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు స్వర్ణ రథం, రాత్రి 7 నుంచి 9 వరకు గజ వాహన సేవ జరుగుతుంది. ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు.

ఎనిమిదో రోజున ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. చివరి రోజైన తొమ్మిదో రోజున ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండు, మూడు, నాలుగో రోజుల్లో మధ్యాహ్నం సమయంలో రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపనం తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహనసేవకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.