
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ రూపొందించాడు. డి మధు నిర్మించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఎక్సయిట్‌మెంట్‌ను పెంచగా, మంగళవారం (ఏప్రిల్ 8న) ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ పవర్ ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది.
ఓదెల 2 ఓటీటీ:
లేటెస్ట్గా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటకి వచ్చాయి. ఓదెల 2 ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా హక్కుల కోసం ప్రైమ్ వీడియో దాదాపు రూ.18 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించిందంటే సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. నిర్మాతలు ఇంకా శాటిలైట్ డీల్ కుదుర్చుకోలేదు. అయితే, ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.25 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఇకపోతే ఫస్ట్ పార్ట్ ఓదెల మూవీ నేరుగా ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చింది.
ట్రైలర్ ఎలా ఉందంటే:
‘భరత ఖండాన, దక్షిణ గంగా తీరాన, ఆ పరమాత్ముడి పుట్టిల్లు అయిన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది’ అని బేస్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
ఓదెల గ్రామానికి పొంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను కాపాడటానికి నాగ సాధు పాత్రలో తమన్నా చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ‘మనం నిలబడాలంటే భూమాత.. మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు.. ’ లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి.
ట్రైలర్ చివరిలో అమ్మవారిగా ఉగ్రరూపంలో కనిపించింది తమన్నా. వశిష్ట ఎన్ సింహ పోషించిన నెగిటివ్ రోల్ ఇంప్రెస్ చేయగా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, నాగ మహేష్, షఫీ, గగన్ విహారి ముఖ్య పాత్రల్లో కనిపించారు.
అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాపై అంచనాలు పెంచింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు ఇది సీక్వెల్. మంగళవారం ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని టీమ్ చెప్పింది.