ODI World Cup 2023: మొన్న రోహిత్.. నిన్న సూర్య: కోహ్లీ ప్రవర్తనపై మండిపడుతున్న నెటిజన్స్

ODI World Cup 2023: మొన్న రోహిత్.. నిన్న సూర్య: కోహ్లీ ప్రవర్తనపై మండిపడుతున్న నెటిజన్స్

ఛేజ్ మాస్టర్, రన్ మెషిన్, కింగ్.. నిన్నమొన్నటి దాకా భారత ఆటగాడు విరాట్ కోహ్లీకి ఉన్న బిరుదులు. ఇప్పుడు ఆ జాబితాలోకి 'స్వార్థపరుడు' అనే పేరు కూడా చేరిపోయింది. కోహ్లీ నిలకడగా రాణించడం సంతోషాన్నిచ్చేదే అయినా.. పరుగుల కోసం అతడు ఇతర ఆటగాళ్లను ఇబ్బందులు పాలు చేయడమే ఈ విమర్శలకు కారణమవుతోంది.

మొన్న రోహిత్

అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్- కోహ్లీ మధ్య పెద్ద మిక్సప్ జరిగింది. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో హారిస్ రౌఫ్ వేసిన ఓ బంతిని మిడ్-ఆన్ వైపు కొట్టిన రోహిత్ సింగిల్ కోసం పరుగెత్తాడు. కానీ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న కోహ్లీ వెంటనే స్పందించలేదు. బంతిని చూస్తూ అలానే ఉండిపోయాడు. రోహిత్ మాత్రం కోహ్లీ ఎలాంటి కాల్ లేకపోవడంతో అతడు వస్తాడనుకొని.. సగం పిచ్ దాటేస్తాడు. అప్పుడు మరోదారి లేకపోవడంతో కోహ్లి మరో ఎండ్‌కు దూసుకెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ కోహ్లీ అలా చేయకుంటే.. రోహిత్ రనౌట్ అయ్యేవాడు.

నిన్న సూర్య

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ అలానే ప్రవర్తించాడు. 9వ ఓవర్‌లో బౌల్ట్ వేసిన ఓ బంతిని సూర్య కవర్ దిశగా షాట్ ఆడాడు. బంతి ఫీల్డర్‌ను దాటి వెళ్లిందనుకొని ముందుకు పరుగు కోసం ప్రయత్నించాడు. కోహ్లీ మొదట కాల్ ఇచ్చినప్పటికీ.. వెంటనే ఫీల్డర్ డైవ్ చేసి బంతిని అందుకోవడంతో వెనక్కి తగ్గాడు. దీంతో ఫీల్డర్‌ను చూసుకొని సూర్య పరిగెత్తుకుంటూ నాన్ స్ట్రైక్ ఎండ్ కు చేరి పోయాడు. కానీ విరాట్ అప్పటికీ పరిగెత్తకపోవడంతో.. సూర్య రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

కోహ్లీ స్వార్థం

ఈ రెండు సందర్భాల్లోనూ కోహ్లీనే ఉండటం అతనిపై విమర్శలకు కారణమవుతోంది. వికెట్ల మధ్య చిరుత పులిలా పరిగెత్తగలిగే కోహ్లీ.. అనుకుంటే తేలిగ్గా సింగిల్ వచ్చేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ కంటే వేగంగా పరిగెత్తగలడు. అందునూ కోహ్లి లాంటి ఫిట్‌గా ఉండే ఆటగాడు అయితే మరింత వేగంగా మరో ఎండ్ చేరుకోగలడు. అయినా సరే కోహ్లి ఫీల్డర్‌ను గమనిస్తూ.. పరిగెత్తకుండా ఆగిపోవడం అభిమానులకు రుచించడం లేదు. పరుగులు కోసం.. సెంచరీలు చేయాలన్న తాపత్రయంతో ఇతరులను ఇబ్బంది పడుతున్నాడని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.