- 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపు
- చెలరేగిన కోహ్లీ, షమీ
- డారిల్ మిచెల్ సెంచరీ వృథా
ధర్మశాల: వరల్డ్ కప్‌లో ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గ్రాండ్ విక్టరీలతో టాప్‌లోకి దూసుకొచ్చింది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (104 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95).. బౌలింగ్‌లో మహ్మద్ షమీ (5/54) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. దీంతో 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో ఇండియా.. కివీస్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన కివీస్ 50 ఓవర్లలో 273 రన్స్‌కు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (127 బాల్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130) సెంచరీ చేయగా, రాచిన్ రవీంద్ర (75) రాణించాడు. తర్వాత ఇండియా 48 ఓవర్లలో 274/6 స్కోరు చేసి నెగ్గింది. రోహిత్ (46), జడేజా (39 నాటౌట్) ఆకట్టుకున్నారు. షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
షమీ ‘పాంచ్’
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలో తడబడ్డా.. రవీంద్ర, మిచెల్ కీలక భాగస్వామ్యంతో కోలుకుంది. దీనికి తోడు ఇండియా ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. 4వ ఓవర్‌లోనే కాన్వే (0)ను ఔట్ చేసి సిరాజ్ (1/45) మంచి ఆరంభాన్నిస్తే.. 9వ ఓవర్ నుంచి షమీ జోరందుకున్నాడు. విల్ యంగ్ (17)ను ఔట్ చేసిన అతను మొత్తం ఐదు వికెట్లు తీసి కివీస్ స్కోరును కట్టడి చేశాడు. 19/2 స్కోరు వద్ద జోడీ కట్టిన రవీంద్ర, మిచెల్.. ఇండియా పేస్–స్పిన్ కాంబినేషన్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. షమీ బౌలింగ్‌లో పాయింట్ వద్ద జడేజా క్యాచ్ మిస్ చేయడంతో బయటపడ్డ రవీంద్ర వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల్లా ఒడిసి పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదారు. 69 రన్స్ వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా (33వ ఓవర్) లాంగాన్‌లో వదిలేశాడు. చివరకు 34వ ఓవర్‌లో రవీంద్రను ఔట్ చేసిన షమీ నాలుగో వికెట్‌కు 159 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ (2/73).. లాథమ్ (5)ను ఎల్బీ చేశాడు. ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్(23) మెల్లగా ఆడినా మిచెల్ దూకుడు మాత్రం ఆగలేదు. ఫలితంగా కివీస్ 36.1 ఓవర్లలో 200 స్కోరుకు చేరింది. 45వ ఓవర్‌లో కుల్దీప్.. ఫిలిప్స్‌ను వెనక్కి పంపడంతో కివీస్ చకచకా వికెట్లు కోల్పోయింది. బుమ్రా (1/45).. చాప్‌మన్ (6)ను ఔట్ చేస్తే 48వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో షమీ.. సాంట్నెర్ (1), హెన్రీ (0)ను పెవిలియన్‌కు పంపాడు. వంద బాల్స్‌లో మిచెల్ సెంచరీ పూర్తి చేసినా, ఇండియా బౌలర్లు ఆరు ఓవర్లలో వ్యవధిలో 30 రన్స్ తేడాతో ఆరు వికెట్లు తీసి రన్స్‌ను కట్టడి చేశారు.
కోహ్లీ కేక..
ఛేజింగ్‌లో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లే మొత్తం రోహిత్, గిల్ (26) మంచి సమన్వయంతో ఆడారు. కివీస్ బౌలింగ్‌లో ఎదురుదాడి లేకపోవడంతో హిట్‌మ్యాన్ సిక్సర్లు దంచాడు. గిల్ కూడా రోహిత్‌కు సమానంగా బౌండ్రీలు బాదడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 63/0 స్కోరు చేసింది. ఈ దశలో కాస్త పుంజుకున్న కివీస్ బౌలర్లు మూడు ఓవర్ల తేడాలో ఓపెనర్లను ఔట్ చేశారు. 76/1 వద్ద వచ్చిన కోహ్లీ, శ్రేయస్ (33) సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ముఖ్యంగా శ్రేయస్ వరుస ఫోర్లతో మూడో వికెట్‌కు 52 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. కానీ కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉండి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. కేఎల్ రాహుల్ (27)కు తోడు సూర్యకుమార్ (2) అనూహ్య రనౌట్‌తో ఇండియా 191/5తో కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే లోయర్ ఆర్డర్‌లో జడేజా సూపర్‌గా ఆడాడు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు సాధిస్తూ కోహ్లీకి మంచి సహకారం అందించాడు. దీంతో టార్గెట్ ఈజీగా కరిగింది. ఇక 90ల్లోకి వచ్చిన కోహ్లీ 49వ సెంచరీ చేస్తాడని భావించినా.. చివర్లో లయ తప్పాడు. 95 రన్స్ వద్ద హెన్రీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో సచిన్ (49 సెంచరీలు) రికార్డుకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. చివరకు జడేజా బౌండ్రీతో ఇండియాను గెలిపించాడు. ఫెర్గుసన్ 2 వికెట్లు తీశాడు.
- వన్డేల్లో అత్యధిక వేగంగా 2 వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ (38 ఇన్నింగ్స్) రికార్డు సృష్టించాడు. తద్వారా హషీమ్ ఆమ్లా (40 ఇన్నింగ్స్)ను అధిగమించాడు.
- వన్డే వరల్డ్ కప్ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించిన తొలి ఇండియన్ బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. 2019 మెగా టోర్నీలో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ ఒక్కోసారి ఐదు వికెట్ల హాల్ సాధించారు.
- ఇండియా తరఫున వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా షమీ (36) నిలిచాడు. శ్రీనాథ్, జహీర్ ఖాన్ చెరో 44 వికెట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.