హైదరాబాద్‌ చేరిన పాక్ జట్టు.. ఆ దేశ జెండాలతో స్వాగతం పలికిన అభిమానులు

హైదరాబాద్‌ చేరిన పాక్ జట్టు.. ఆ దేశ జెండాలతో స్వాగతం పలికిన అభిమానులు

వన్డే ప్రపంచ కప్ సమరం కోసం దాయాది పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ విమాశ్రయంలో వీరి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగా.. హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు వారికి ఘనస్వాగతం పలికారు. మరి ఎంతలా ఘనస్వాగతం అంటే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాకిస్తాన్ జెండాలు రెపరెపలాడించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉప్పల్ వేదికగా పాక్ 4 మ్యాచ్‌లు

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జట్టు ఉప్పల్ వేదికగా.. ఈనెల 29న న్యూజిలాండ్‍తో, అక్టోబరు 3న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం అక్టోబరు 6న నెదర్లాండ్స్‌‌తో; అక్టోబర్ 10న శ్రీలంకతో ప్రధాన మ్యాచ్‌ల్లో తలపడనునుంది. ఈ విధంగా పాక్.. ఉప్పల్ గడ్డపై 4 మ్యాచ్‌లు ఆడనుంది. తెలుగు గడ్డపై ఇండియా మ్యాచ్‌లు లేకపోవటం నిరాశపరిచేదే అయినా.. పాక్ మ్యాచ్‌లు ఉండటం కాస్తైనా ఆనందపరిచేదే.

భద్రత కల్పించలేమన్న పోలీసులు

ఈ మ్యాచ్‍కు ముందురోజు నగరంలో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుస రోజుల్లో అంటే తగినంత భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేయడంతో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించడం లేదు. పాక్ క్రికెట్ జట్టు బంజారాహిల్స్‌‌లోని పార్క్ హయత్‌ హోటల్‌‌లో బసచేయనుంది.

పాకిస్తాన్ వరల్డ్ కప్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ.