క్రికెట్‌ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా భావించే అభిమానులను ఎంటర్టైన్ చేసే మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలయింది. మరో 8 రోజుల్లో ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభంకానుంది. అయితే ప్రధాన మ్యాచ్‌లకు ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌ల్లో తలపడి తమ అస్త్రాలను పరీక్షించుకోనున్నాయి. అది కూడా ఈ వార్మప్ మ్యాచ్‌లు హైదరాబాద్ నుంచే మొదలు కానుండటం గమనార్హం.
సెప్టెంబర్ 29న ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే వారి వారి దేశాలలో విమానం ఎక్కేశారు. కివీస్ ఆటగాళ్లలో కొందరు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన వారు బుధవారం చేరుకోనున్నారు. ఆలస్యంగా వీసాలు అందుకున్న పాకిస్థాన్ జట్టు దుబాయ్ మీదుగా బుధవారం రాత్రి 8.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సోషల్ మీడియాలో పంచుకున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు తెలంగాణ పోలీసులు సరైన భద్రత కల్పించలేమని చెప్పడంతో భద్రతా కారణాల దృష్ట్యా.. ప్రేక్షకులను అనుమతించడం లేదు.
Final farewells and time for take off! The second group of players and staff have set off from Christchurch to India for the @cricketworldcup. #CWC23 pic.twitter.com/SQfGZwyHIH
— BLACKCAPS (@BLACKCAPS) September 26, 2023
పాకిస్తాన్ వరల్డ్ కప్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ.
న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.