ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. సౌతాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రద్దు

ప్రపంచకప్ 2023 మెగా సమరాన్ని కళ్లారా ఆస్వాదించాలనుకున్న క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందుతోంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు జరిగే సన్నాహక మ్యాచ్‌లకు(వార్మప్ మ్యాచ్‌లు) వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. దీంతో శుక్రవారం సౌతాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ బంతి పడకుండానే రద్దయ్యింది.

శుక్రవారం ఉదయం నుంచి తిరువనంతపురం(కేరళ)లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ జరగాల్సిన గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం తడిసి ముద్దయ్యింది. ఒకవేళ వర్షం తగ్గినా.. మైదానాన్ని సిద్ధ చేయడం సిబ్బందికి సవాల్‌తో కూడుకున్నదే. మైదానంలో కొంత భాగాన్ని మాత్రమే కవర్లతో కప్పిఉంచడటంతో మిగిలిన భాగంలో వర్షపు నీటి ధాటికి కుంటలు ఏర్పడ్డాయి. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్‌- పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దీంతో ఈ టోర్నీలో పలు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.