హైదరాబాద్‌కు వరల్డ్ కప్ జట్లు రాక.. ఎక్కడ బసచేయనున్నారంటే..?

దేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సందడి మొదలైపోయింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా భారత్‌ చేరుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ ఇప్పటికే భారత్‌లో ఉండగా.. అఫ్గానిస్తాన్‌ జట్టు మంగళవారం తిరువనంతపురం చేరుకుంది. ఇక న్యూజిలాండ్‌ జట్టులోని కొందరు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకోగా.. మిగిలిన వారు బుధవారం రాత్రికి చేరుకోనున్నారు. 

ఇక ఆలస్యంగా వీసాలు అందుకున్నదాయాది పాకిస్తాన్ జట్టు దుబాయ్‌ మీదుగా బుధవారం రాత్రి 8.15 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనుంది. అలాగే, శ్రీలంక జట్టు సైతం బుధవారం రాత్రి 10 గంటల సమయానికి  హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అక్కడినుంచి ఆటగాళ్లు నేరుగా వారికి కేటాయించిన హోటళ్లకు చేరుకోనున్నారు.  

ఆయా జట్లు.. బస చేయనున్న హోటల్స్

  • పాకిస్తాన్: పార్క్ హయత్‌ (బంజారాహిల్స్‌)
  • న్యూజిలాండ్: ఐటీసీ కాకతీయ
  • శ్రీలంక: నోవొటెల్(శంషాబాద్)
  • ఆస్ట్రేలియా: తాజ్ కృష్ణ
  • నెదర్లాండ్స్‌: తాజ్ కృష్ణ 

ఉప్పల్‌ వేదికగా 5 మ్యాచ్‌లు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు కాగా.. మిగిలిన మూడు ప్రధాన మ్యాచ్‌లు. ఈనెల 29న న్యూజిలాండ్ - పాకిస్తాన్, అక్టోబరు 3న ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం అక్టోబరు 6న నెదర్లాండ్స్‌ - పాకిస్తాన్; 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్‌; 10న శ్రీలంక - పాకిస్తాన్ ప్రధాన మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.