అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. భారత్ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీనికి ముందు 1987లో పాకిస్థాన్‌తో, 1996లో శ్రీలంక మరియు పాకిస్థాన్‌తో, 2011లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో కలిసి భారత్ మూడుసార్లు వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించింది.
1975లో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ ప్రస్థానం ఇప్పటివరకు 12 ఎడిషన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు జరగబోయేది 13వ ఎడిషన్. ఈ 12 ఎడిషన్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఐదు సార్లు విజేతగా నిలవగా.. వెస్టిండీస్, ఇండియా రెండేసి సార్లు.. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఒక్కోసారి ఛాంపియన్ నిలిచాయి. మొదటిసారి వన్డే వరల్డ్ కప్ జరిగిన 1975లో 60 ఓవర్ల మ్యాచ్ లు నిర్వహించారు. అనగా ఒక్కో ఇన్నింగ్స్ కు 60 ఓవర్ల చొప్పున ఉండేవి. అనంతరం 1987 నుంచి ఓవర్లను 50కి కుదించారు.
1975 నుంచి 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో ఎవరు..? ఎప్పుడు..? విజేతగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం..
1975 వరల్డ్ కప్: తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్‌లో వెస్టిండీస్ జట్టు.. ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది.
1979 వరల్డ్ కప్: రెండో ఎడిషన్ లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన కరేబియన్ జట్టు(వెస్టిండీస్) రెండోసారి కూడా విజేతగా నిలిచింది.
1983 వరల్డ్ కప్: భారత క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ప్రపంచ కప్ ఇది. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసింది ఇక్కడే. చేసింది 183 పరుగులే అయినా.. బలమైన విండీస్ 140కే కట్టడి చేసి 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
1987 వరల్డ్ కప్: తొలిసారి ఇంగ్లండ్ వెలుపల జరిగిన ఈ ప్రపంచ కప్‌ను అల్లన్ బోర్డర్ నాయకత్వంలోని 1987 నాటి ఆసీస్ జట్టు సొంతం చేసుకుంది.
1992 వరల్డ్ కప్: ఈ టోర్నీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు.. ఇంగ్లండ్ ను చిత్తు చేసి టైటిల్ విజేతగా నిలిచింది.
1996 వరల్డ్ కప్: ఈ ఎడిషన్ శ్రీలంక క్రికెట్ కు ఓ మధుర జ్ఞాపకం. అర్జున్ రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు.. పైనల్‌లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది.
1999 వరల్డ్ కప్: లీగ్ దశ నుండి నాకౌట్ మ్యాచ్ ల వరకు హోరాహోరీగా సాగిన ఈ ప్రపంచ కప్ లో.. ఫైనల్ మాత్రం ఏకపక్షంగా సాగింది. మొదట పాకిస్తాన్ జట్టును 132 పరుగులకే కట్టడిచేసిన ఆస్ట్రేలియా జట్టు.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
2003 వరల్డ్ కప్: భారత క్రికెట్ అభిమానులకు ఓ చేదు జ్ఞాపకం ఈ టోర్నీ. రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు ఫైనల్‌లో.. ఇండియాను ఓడించి సాధించి ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
2007 వరల్డ్ కప్: 53 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
వరల్డ్ కప్ 2011: భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే టోర్నీ ఇది. ఈ టోర్నీకి భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్యమివ్వగా ఫైనల్లో ధోనిసేన.. లంకేయులను ఓడించి రెండోసారి ప్రపంచ కప్ ను ముద్దాడింది.
2015 వరల్డ్ కప్: మైకెల్ క్లార్క్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వ విజేతగా నిలిచింది.
2019 వరల్డ్ కప్: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ కల సాకారమైంది ఇక్కడే. ఫైనల్ లో ఇంగ్లీష్ జట్టు.. బౌండరీల సాయంతో విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది.
2023 వరల్డ్ కప్: ?