ODI World Cup 2023 : ఉప్పల్ మ్యాచ్కు వెళుతున్నారా.. వీటిని తీసుకెళితే నో ఎంట్రీ

ODI World Cup 2023 : ఉప్పల్ మ్యాచ్కు వెళుతున్నారా.. వీటిని తీసుకెళితే  నో ఎంట్రీ

హైదరాబాద్ ఉప్పల్లోని  రాజీవ్ గాంధీ స్టేడియంలో వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రేక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు  చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో వివరించారు. 

ఇవి నిషేధం..

పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ కు వచ్చే  ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్లు, పదునైన లోహాలు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్‌లు, నాణేలు, రైటింగ్ పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పెర్ఫ్యూమ్‌లు, సంచులు,  బయటి తినుబండారాలు తీసుకురావద్దని పోలీసులు సూచించారు. 

పటిష్ట చర్యలు..

మ్యాచ్ కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.  పార్కింగ్ స్థలాలు సహా వివిధ పాయింట్ల వద్ద మొత్తం 360 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే బాంబు నిర్వీర్య బృందం,  స్నిఫర్ డాగ్‌లతో స్టేడియంలో  తనిఖీలు చేశారు. స్టేడియంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల దగ్గర తనిఖీ చేయడానికి చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.
స్టేడియం పరిసర ప్రాంతాల్లో అదనపు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.

స్టేడియంలో ఈవ్ టీజింగ్‌ను నియంత్రించేందుకు షీ టీమ్‌లు,యాంటీ-ఈవ్ టీజింగ్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల నకిలీ టికెట్లు, ఇతర మోసాలను నియంత్రించడానికి విజిలెన్స్ బృందాలను నియమించారు. ప్రేక్షకులు సులభంగా స్టేడియంకు చేరుకోవడానికి తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ లోని ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయడానికి  అనుమతించరు. పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు. 

మరోవైపు  - జెన్‌పాక్ట్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు, ఉప్పల్ రింగ్ రోడ్ నుండి విశాల్ మార్ట్, రామంతపూర్ దగ్గర ప్రేక్షకులకు తక్షణ వైద్య సాయం కోసం ఏడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.