Uttam Mohanty: ప్రముఖ దిగ్గజ నటుడు కన్నుమూత.. రాష్ట్ర గౌరవాలను ప్రకటించిన ముఖ్యమంత్రి

Uttam Mohanty: ప్రముఖ దిగ్గజ నటుడు కన్నుమూత.. రాష్ట్ర గౌరవాలను ప్రకటించిన ముఖ్యమంత్రి

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తమ్ మొహంతి (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో మరణించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కొంతకాలంగా కాలేయ సిర్రోసిస్‌కు చికిత్స పొందుతూ గురువారం (ఫిబ్రవరి 27న) ఢిల్లీలో మరణించారు. ఈ దిగ్గజ నటుడి మృతితో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

మొహంతి మరణం ఒడియా కళలకు తీరని లోటని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి (Mohan Charan Majhi) అభివర్ణించారు. మొహంతి అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించబడతాయని కూడా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు మరియు కేంద్రపార ఎంపీ బైజయంత్ పాండా X వేదికగా.. దిగ్గజ నటుడి మొహంతి మృతికి సంతాపం తెలిపారు.

"ఒడియా చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది! ప్రఖ్యాత నటుడు ఉత్తమ్ మొహంతి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను మరియు హృదయ విదారకంగా ఉన్నాను. ఒడియా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అమూల్యమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. వారి ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పాండా X వేదికగా తెలిపారు. 

మొహంతి నట ప్రస్థానం:

మొహంతి 130 కి పైగా చిత్రాలలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒడియా సినిమాలలో తిరుగులేని నటుడిగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

1977 లో సాధు మెహర్ దర్శకత్వం వహించిన అభిమాన్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత దండా బలుంగా మరియు కీ జీతే కీ హారే వంటి హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు. దాదాపు ఆయన 30 బెంగాలీ చిత్రాలలో నటించాడు. అలాగే హిందీ చిత్రం నయా జహెర్‌లో కీలక పాత్ర పోషించాడు. 

అవార్డులు:

నటుడు ఉత్తమ్ మొహంతి 1999లో ప్రతిష్టాత్మక జయదేవ్ పురస్కారంతో సత్కరించారు. 2012లో ఒడిశా లివింగ్ లెజెండ్ అవార్డును సైతం అందుకున్నారు. ఒడియా సినిమాకు చేసిన కృషికి గాను ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఉత్తమ్ మొహంతి పలుసార్లు గెలుచుకున్నారు.