ఒడిశాలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌

ఒడిశాలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌
  • ఒక మావోయిస్ట్‌‌‌‌ మృతి, బలగాల అదుపులో మరో ఇద్దరు
  • కాల్పుల్లో ఓ జవాన్‌‌‌‌కు గాయాలు

భద్రాచలం, వెలుగు : ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌‌‌‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌‌‌‌ జిన్నెలగూడెంలో గురువారం ఉదయం ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ జరిగింది. కాల్పుల్లో ఓ మావోయిస్ట్‌‌‌‌ చనిపోగా, మరో ఇద్దరిని పోలీస్‌‌‌‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఘటనలో డమరూ బడ్‌‌‌‌నాయక్‌‌‌‌ అనే జవాన్‌‌‌‌ గాయపడ్డాడు. అతడిని మల్కన్‌‌‌‌గిరి జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కలిమెల డీఎస్పీ సందీప్‌‌‌‌ పాటిల్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... 30 మంది మావోయిస్ట్‌‌‌‌లు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రబోరు వద్ద శబరి నదిని దాటి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌‌‌‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌‌‌‌ జిన్నెలగూడెం అడవుల్లోకి ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీస్‌‌‌‌ బలగాలు గురువారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్‌‌‌‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్ట్‌‌‌‌లు కాల్పులు ప్రారంభించారు. పోలీస్‌‌‌‌ బలగాలు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఓ మావోయిస్ట్‌‌‌‌ చనిపోగా, మరో ఇద్దరిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మిగతా వారు అడవుల్లోకి పారిపోయారు. ఘటనాస్థలంలో మావోయిస్ట్‌‌‌‌ల ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్ట్‌‌‌‌ల కోసం ప్రత్యేక బలగాలు కూంబింగ్‌‌‌‌ 
నిర్వహిస్తున్నాయి.