
భువనేశ్వర్: ఒడిశా మహానదిలో నీటమునిగిన పురాతన ఆలయం ఒకటి వెలుగుచూసింది. నయాగఢ్ జిల్లా పరిధిలోని ఆ గుడి 500 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. పద్మావతి గ్రామం బైదీశ్వర్ దగ్గరగల మహానదిమధ్యలో నీటిమునిగిన ఆ గుడి ఆనవాళ్లను కనుగొన్నట్టు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీపక్‌కుమార్ నాయక్ చెప్పారు. 60 అడుగుల లోతులో మునిగిపోయిన ఆ గుడి 15 లేదా 16 శతాబ్దానికి చెంది ఉంటుందన్నారు. గుడి కట్టడానికి వాడిన మెటీరియల్ ఆధారంగా ఈ అంచనాకు వచ్చామన్నారు. గోపీనాథ్ దేవుడి గుడిగా దీన్ని గుర్తించారు. 150 ఏళ్ల కిందట వచ్చిన వరదల కారణంగా నది తన దిశను మార్చుకుంది. దీంతో 19 శతాబ్దంలోనే పద్మావతి గ్రామమంతా నీటిలో మునిగిపోయింది. చుట్టుపక్కల ఇలాంటి ఆలయాలు 22 వరకు ఉంటాయని గ్రామస్తులు చెప్పారు.