ఒడిశా అసెంబ్లీ చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ను కొంచెం కొత్తగా ప్రవేశపెట్టింది ఆ రాష్ట్రం. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి నిరంజన్ పుజారి బడ్జెట్‌ను పెన్ డ్రైవ్‌లో సీఎం నవీన్ పట్నాయక్‌కు సమర్పించారు. అటు తర్వాత సభలో ఎమ్మెల్యేలందరికీ ఐపాడ్‌లు, బడ్జెట్ పేపర్లున్న పెన్‌డ్రైవ్‌లు అందించారు. బడ్జెట్ స్పీచ్‌ను ఐపాడ్‌లోనే మంత్రి చదివారు. ఇదే విషయాన్ని సీఎం పట్నాయక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘పచ్చదనంతో కళకళలాడే, సస్టెయినబుల్ భవిష్యత్‌ను ముందు తరాలకు అందించాలనుకుంటున్నాం. అందుకే పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. డిజిటల్ పద్ధతుల వల్ల 75 లక్షల పేజీలను ప్రింట్ చేయాల్సిన అవసరం రాలేదు. సుమారు వెయ్యి పెద్ద చెట్లను కొట్టేయకుండా రక్షించగలిగాం’ అని ట్వీట్ చేశారు. అందుకే దీన్ని ‘గ్రీన్ బడ్జెట్’ అంటున్నామన్నారు. కాగా, అంతకుముందు 2015లో హిమాచల్ ప్రదేశ్ గ్రీన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఒడిశా రెండో రాష్ట్రం.
పోషక పద్దు రూ.5,500 కోట్లు
ఈ సారి ఒడిశా బడ్జెట్‌కు రెండో స్పెషాలిటీ కూడా ఉంది. న్యూట్రిషన్ (పోషణ) కోసం దేశంలో తొలిసారి ప్రత్యేక బడ్జెట్‌ను పెట్టింది. ఈ ఏడాదికి రూ.5,543 కోట్లను పోషణ పథకాలకు కేటాయించారు. పోషణతో సంబంధమున్న ఇతర పథకాలకు రూ. 25,571 కోట్లు ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోగలమన్న నమ్మకముందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి నిరంజన్ చెప్పారు. బలహీన వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా, వాళ్లలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి ఈ పోషక బడ్జెట్ ఉపయోగపడుతుందని సీఎం పట్నాయక్ ట్వీట్ చేశారు. న్యూట్రిషన్ బడ్జెట్ వాటా మొత్తం పద్దులో 4.5 శాతమన్నారు. చిన్నారులకు సంబంధించిన పథకాల కోసం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని, ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.16,294 ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఒరిస్సాలో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు గత పదేళ్లలో చాలా వరకు తగ్గాయని నాలుగో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. 2005లో 91గా ఉన్న సంఖ్య 2015కు 48కి తగ్గిందని సర్వే పేర్కొంది.