- 13 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశాలోని మద్నాపూర్ రాంపూర్‌లో ఘోరం జరిగింది. మావోయిస్టుల పెట్టిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేలుడు సంభవించి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్ ప్రాణాలు కోల్పోయాడు. మద్నాపూర్ రాంపూర్ బ్లాక్‌లోని డోంకర్లకుంట గ్రామం సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు మృతికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. జర్నలిస్ట్ రోహిత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.13 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Chief Minister Naveen Patnaik announced Rs 13 lakh compensation for the family of journalist Rohit Kumar Biswal, who was killed in an IED explosion today
— ANI (@ANI) February 5, 2022
మావోయిస్టులు వేసిన పోస్టర్ దగ్గరకు వెళ్లి..
ఒడిశాలో ఈ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తూ మావోయిస్టులు డోంకర్లకుంట గ్రామం సమీపంలో ఓ చెట్టుకు పోస్టర్లు అంటించారు. దీని గురించి సమాచారం తెలియడంతో ఒడిశాకు చెందిన ధరిత్రి పత్రికలో పని చేస్తున్న 46 ఏండ్ల రోహిత్ కుమార్ బిశ్వాల్.. తన విధి నిర్వహణలో భాగంగా ఆ పోస్టర్‌లను చూసేందుకు వెళ్లాడు. వాటిని పరిశీలించేందుకు చెట్టు వద్దకు వెళ్లగా ఒక్కసారిగా ఐఈడీ బ్లాస్ట్ సంభవించడంతో తీవ్రగాయాలపైన రోహిత్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కన్నా ముందే వెళ్లడంతో ఘోరం
మావోయిస్టులు వేసిన పోస్టర్ల గురించి సమాచారం తెలియగానే పోలీసుల కన్నా ముందుగానే రోహిత్ ఆ స్పాట్‌కు చేరుకున్న కారణంగానే ఈ ఘోరం జరిగిందని కలహండి జిల్లా ఎస్పీ వివేక్ చెప్పారు. ‘‘సాధారణంగా ఇలాంటి పోస్టర్లను కనిపించిన సమయంలో తాము ఒక స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఆ ప్రాంతాల్లో పోలీసులను టార్గెట్ చేసి ఐఈడీలను పెట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మా టీమ్ ఆ ప్రాంతానికి మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి వెళ్లింది. కానీ అంతలోనే జర్నలిస్ట్ రోహిత్ అక్కడికి వెళ్లి పోస్టర్లను పరిశీలించేందుకు చెట్టు దగ్గరకు అడుగులు వేయడంతో అక్కడ అమర్చిన ఐఈడీ పేలి.. ఈ దురదృష్ట ఘటన జరిగింది” అని ఎస్పీ వెంకట్ చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారని అన్నారు.