కరోనా కట్టడిలో  ఒడిశా రోల్ మోడల్

కరోనా కట్టడిలో  ఒడిశా రోల్ మోడల్

భువనేశ్వర్:కరోనా సెకండ్ వేవ్  దేశాన్ని కుదిపివేస్తోంది. మెడికల్ ఆక్సిజన్, అత్యవసరమైన మందులు లేక కొన్ని రాష్ట్రాలు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. అయితే ఒడిశా మాత్రం కరోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మెడికల్ ఆక్సిజన్ కు ఎక్కడా కొరత రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడమే కాకుండా మరో ఆరు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను సప్లయ్ చేస్తోంది. ఏప్రిల్ 22 నుంచి తెలంగాణ, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాకు  1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 67 ట్యాంకర్లలో సప్లయ్ చేసింది. ‘రోజూ 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాం. అదనంగా 129 మెట్రిక్ టన్నులు అందుతోంది. రోజూ 40 నుంచి 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నాం’ అని చీఫ్ సెక్రటరీ సురేశ్ చంద్ర మహాపాత్ర చెప్పారు. తమ రాష్ట్రంలో ఎక్కువ స్టీల్ ప్లాంట్లు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

ఫస్ట్ వేవ్‌‌‌‌నూ పకడ్బందీగా ఎదుర్కొన్నది.. 

విపత్తులను ఎదుర్కోవడంలో ఒడిశాకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లోనూ ఒడిశా వేగంగా స్పందించింది. వివిధ రాష్ట్రాల నుంచి 1-0 లక్షల మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లు తిరిగిరాగా, వాళ్లందరినీ క్వారంటైన్ చేసింది. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం 8 లక్షల బెడ్లతో టెంపరరీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.  కొన్ని వర్గాలకు ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా ప్రకటించింది. సెకండ్ వేవ్ టైమ్ లోనూ ఒడిశా అలర్ట్ అయ్యింది. ఏప్రిల్ 1న చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో బార్డర్లను మూసేసింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు నెగెటివ్ రిపోర్ట్ కంపల్సరీ  చేసింది. ఎవరైనా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వకపోతే బార్డర్ పాయింట్లలోనే క్వారంటైన్ చేస్తోంది. మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఇంప్రూవ్ చేసుకుంది.  

కరోనా పేషెంట్లకు ఫ్రీ ట్రీట్ మెంట్

ఒడిశాలో 50 కొవిడ్ హాస్పిటల్స్ ఉండగా వాటిలో 30 ప్రైవేటువే. ఏప్రిల్ 27 నాటికి బెడ్ల కెపాసిటీ 11 వేలు కాగా అక్యుపెన్సీ 35 శాతంగా ఉంది. ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా.. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకమైన హాస్పిటళ్లు ఏర్పాటు చేసినట్టు సీఎస్ మహాపాత్ర చెప్పారు. బెడ్ల కెపాసిటీ పెంచేందుకు మరిన్ని ప్రైవేటు హాస్పిటళ్లతో చర్చిస్తున్నట్టు తెలిపారు.  కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చును ఒడిశా ప్రభుత్వమే భరిస్తోంది. రోజుకు ఓ బెడ్ కు రూ.5 వేలు కాగా ఐసీయూకు రూ.17 వేలుగా నిర్ణయించింది. జనం చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేమని, అందుకే  కరోనా పేషెంట్లందరికీ ఉచితంగా ట్రీట్ మెంట్ ఇస్తున్నామని సీఎస్ చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ లో 40 వేల మందికి ట్రీట్ మెంట్ అందించినట్టు తెలిపారు. 18 నుంచి 45 ఏండ్ల లోపు వారికి టీకాలు అందించేందుకు ఒడిశా సర్కార్ రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు 2.53 లక్షల చొప్పున ఇప్పటికే 60 లక్షల మందికి వ్యాక్సిన్లు 
వేశారు.