ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌కు సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్‌డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా సహా పలువురు ఉన్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. ఇటీవలె ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు.
రాజకీయాల్లో గిరిధర్ గమాంగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ 9 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు.