కూలిన ఓపెన్ కాస్ట బొగ్గు గని.. నలుగురు మృతి

కూలిన ఓపెన్ కాస్ట బొగ్గు గని.. నలుగురు మృతి

బొగ్గు గని కూలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలోని భరత్‌పూర్‌లో మంగళవారం జరిగింది. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ కు చెందిన బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై మహానది కోల్‌ఫీల్డ్స్‌ ప్రతినిధి దిక్కెన్‌ మెహ్రా మాట్లాడుతూ ప్రమాదం తర్వాత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని మూసివేయబడిందని, గనిలో తిరిగి తవ్వకాలు ప్రారంభించడానికి కనీసం వారం రోజులు పడుతుందని అన్నారు.

గని వద్ద జరిపిన పేలుడు వల్ల గని పైభాగంనుంచి కొండ చరియ జారిపడిందని స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు పూర్తి చేయడానికి 10 నుంచి 12 గంటలు పడుతుందని మహానది కోల్‌ఫీల్డ్స్ చైర్‌పర్సన్ బిఎన్ శుక్లా తెలిపారు. గాయపడిన వ్యక్తులను స్థానికంగా ఉన్న తల్చర్ నెహ్రూ సెంటెనరీ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు