భారతదేశంలో రాబోయే 45 రోజుల్లో అంటే.. అక్టోబర్ 10వ తేదీ తర్వాత.. నవంబర్ నెలాఖరులోపు.. అంటే ఈ 45 రోజుల్లో అతి భారీ తుఫాన్ రాబోతున్నదా.. ఈసారి దాని తీవ్రత అధికంగా ఉండబోతుందా..? దీనికి కారణం లేకపోలేదు. ఒడిశా ప్రభుత్వం రాబోయే 45 రోజుల్లో వచ్చే తుఫాన్ ప్రభావంపై ఇప్పటి నుంచి అప్రమత్తం అయ్యింది. ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్, ఇతర శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 10వ తేదీ తర్వాత నుంచి 45 రోజుల్లో భారీ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే అప్రమత్తంగా.. ముందస్తు ఏర్పాట్లలో ఉండాలని ఆదేశించారు.
అక్టోబర్ 10వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు పూర్తిగా వెళ్లిపోతాయి. ఈ సారి వర్షపాతం కూడా తక్కువగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పొడి వాతావరణ అధికంగా ఉంది. డ్రై వెదర్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ తుఫాన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఒడిశా ప్రభుత్వం. సహజంగానే నైరుతి రుతు పవనాలు నిష్క్రమణ తర్వాత.. నవంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్ లకు అవకాశం ఉంటుంది. ఈసారి భిన్నమైన వాతావరణం ఉండటంతో భారీ తుఫాన్ ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన ఆ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఒడిశా ప్రభుత్వానికి తుఫాన్ ముప్పు ప్రతి ఏటా ఉంటుంది. అత్యధిక తుఫాన్ లు ఒడిశాలతో తీరం దాటతాయి. అంతే కాకుండా.. భారతదేశంలోనే అత్యధిక తుఫాన్ లను ఎదుర్కొన్న రాష్ట్రం కూడా ఒడిశా. అంతేకాదు.. డిజాస్టర్ మేనేజ్ మెంట్.. ముందస్తు చర్యలు.. సహాయ చర్యలు, తరలింపు, రక్షణ వంటి చర్యల్లోనూ ఒడిశా ప్రభుత్వానికి మంచి అనుభవం ఉంది. చాలా రాష్ట్రాలు ఒడిశా నుంచే డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్టడీ చేయటం విశేషం.