భువనేశ్వర్: ఒడిశాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. స్టేషన్ లో చాలా రోజులుగా నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్ ఈదురుగాలులకు ఉన్నట్టుండి కదిలింది. దీంతో దానికింద తలదాచుకున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం సాయంత్రం జైపూర్ రోడ్ స్టేషన్లో చోటుచేసుకుందీ విషాదం. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ రోడ్ స్టేషన్ లో అధికారులు చాలా రోజులుగా ఓ గూడ్స్ ట్రైన్ నిలిపి ఉంచారు. దానికి ఇంజన్ కూడా లేదు. కేవలం బోగీలను మాత్రమే వదిలేశారు.
ఈ క్రమంలో రైల్వేలో కాంట్రాక్ట్ కూలీలు కొంతమంది బుధవారం ఎప్పట్లాగే పనికి వచ్చారు. సాయంకాలం పని పూర్తయ్యాక అక్కడే వంట చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో వాతావరణం మారి ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వాన చినుకుల్లో తడవకుండా ఆ పక్కనే ఉన్న గూడ్స్ బోగీల కిందకి వారంతా చేరుకున్నారు. బలమైన ఈదురుగాలులకు ఉన్నట్టుండి బోగీలు కదిలాయి. దీంతో దానికింద నలిగిపోయి ఆరుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు.
గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవలే, బహనాగ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరగడం, ఐదు రోజులు గడిచాయో లేదో ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందనే వార్తలతో జనం ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు.