లక్కంటే వీళ్లదే..పుణ్యానికి ఖాతాలో వేలకు వేలు జమ అయ్యాయి. వేలు అంటే..రెండు వేలు..మూడు వేలు కాదు..ఒక్కో ఖాతాదారుడి అకౌంట్లో ఏకంగా రూ. 10 వేల నుంచి..రూ. 70 వేల వరకు జమ అయ్యాయి. ఫోన్లకు మెసేజ్ లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే బ్యాంకుకు పరిగెత్తారు. తమ ఖాతాల్లో జమ అయిన నగదును తీసుకున్నారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వారి ఖాతాల్లో డబ్బులు ఎవరు వేశారో మాత్రం తెలియదు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఒడిశా రాష్ట్రం కేంద్రపరా జిల్లాలోని ఔల్ బ్లాక్ పరిధిలోని బటిపాడ వద్ద ఒడిశా కళింగ గ్రామీణ బ్యాంకుకు సెప్టెంబర్ 11వ తేదీన ఖాతాదారులు పోటెత్తారు. వందలాదిగా కస్టమర్లు బ్యాంకుకు చేరుకున్నారు. తమ ఖాతాల్లో రూ. 10 వేల నుంచి రూ. 70 వేల వరకు నగదు జమ అయినట్లు ఫోన్లకు మెసేజ్ లు రావడంతో ఖాతాదారులందరు బ్యాంకుకు తరలివచ్చారు. ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకున్నారు.
స్పష్టత లేదు..
తమ ఖాతాల్లో ఎవరు నగదు జమ చేశారో ఖాతాదారులకు కూడా తెలియదు. ఫోన్లకు మెసేజ్ రావడంతో... కస్టమర్లు హుటా హుటీన బ్యాంకుకు చేరుకున్నారు. ఎవరు నగదు జమ చేశారని బ్యాంకు అధికారులను అడిగారు. కానీ వారికి కూడా నగదు జమ చేసిన వారిపై స్పష్టత లేదు. దీంతో తర్వాత సంగతి తర్వాత..ముందు అయితే..అకౌంట్లలో జమ అయిన నగదు తీసుకుందామని..డబ్బును డ్రా చేసుకున్నారు.
సెప్టెంబర్ 11వ తేదీన పొద్దున నుంచి ఒడిశా కళింగ గ్రామీణ బ్యాంకు కస్టమర్లు పోటెత్తారని బ్యాంకు మేనేజర్ ప్రతాప్ ప్రధాన్ తెలిపారు. తమ కస్టమర్ల ఖాతాల్లో రూ. 2వేల నుంచి రూ. 30 వేల వరకు నగదు జమ అయిందని చెప్పారు. అయితే నగదును ఎవరు జమ చేశారో తమకు కూడా తెలియదన్నారు. అయితే ఫసల్ బీమా నుంచి కొంద డబ్బు జమ అయినట్లు గుర్తించామన్నారు. మరికొందరి కస్టమర్ల ఖాతాల్లో అయితే ఏకంగా రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు జమ అయిందన్నారు. అయితే ఎవరు నగదు జమ చేశారో తెలుసుకుంటున్నామన్నారు. మొత్తానికి నగదు ఎవరు జమ చేశారో ఏమో కానీ..ఎవరేశారో తర్వాత చూద్దాం....ముందు అయితే డ్రా చేసుకుందాం అనుకున్నారు. నగదును డ్రా చేసుకుని పండగ చేసుకున్నారు.