ఒకప్పుడు కూలీ. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఏడాది కిందట సొంత ఫోన్ కూడా లేని అతడు ఇప్పుడు అదే స్మార్ట్‌ఫోన్‌తో వీడియోలు తీస్తున్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే యూట్యూబ్ అతడి లైఫ్‌ను మార్చేసింది. ఒడిశాకు చెందిన ఐజక్ ముండా సక్సెస్ స్టోరీ ఇది.
ఒడిశాలోని సంబల్‌పురా జిల్లా బాబుపలికి చెందిన ఐజక్ ముండా కూలీగా పనిచేసేవాడు. పేద కుటుంబం. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. రేకులతో కట్టుకున్న చిన్న ఇంట్లోనే భార్యాపిల్లలతో ఉండేవాడు. చాలీచాలని కూలీ డబ్బులతో నెట్టుకొస్తున్న అతడి లైఫ్‌కు అందరిలాగే గత ఏడాది లాక్‌డౌన్ అడ్డంపడింది. పనిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో ఆకలికి తట్టుకోలేక, దాన్నుంచి బయటపడేందుకు ఫ్రెండ్ మొబైల్‌లో వీడియోలు చూసేవాడు. వీడియోలు చూసి కాలక్షేపం చేస్తే, ఆకలి మర్చిపోవచ్చనేది అతడి ఆలోచన. ఫ్రెండ్ మొబైల్‌లో కొన్నిసార్లు ఫుడ్ వీడియోలు కూడా చూసేవాడు. అలా వీడియోలు చూడటం వల్ల తనకు కూడా ఏదైనా వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది. అది సొంత యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేందుకు కారణమైంది.
అప్పు చేసి.. ఫోన్ కొని..
సొంతంగా వీడియోలు తీసి, యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకున్నాడు ఐజక్. కానీ, అతడి దగ్గర వీడియోలు తీసేందుకు కెమెరా కాదుకదా... స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. దీంతో మూడువేలు అప్పుచేసి, లోక్వాలిటీ స్మార్ట్‌ఫోన్ కొన్నాడు. దీంతో ఒక ఫుడ్ ఈటింగ్ వీడియో చేశాడు. అది తను అన్నం తినే వీడియో. అన్నం, ఆకు కూర, పచ్చి టొమాటో, పచ్చి మిరపకాయ తిన్న వీడియో అది. నాలుగు నిమిషాలున్న ఆ వీడియోతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. గత ఏడాది మార్చిలో ‘ఐజక్ ముండా ఈటింగ్’ పేరుతో ఈ ఛానెల్ మొదలైంది. మొదటి వీడియోనే మంచి క్లిక్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అలా అప్పటినుంచి రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.
అదే ప్రత్యేకత
ఐజక్ వీడియోల్లో ఎక్కువగా తినేవే ఉంటాయి. రోజూ ఏదో ఒక వంట తను, ఫ్యామిలీతో కలిసి తింటాడు. ఐజక్‌ది పేద కుటుంబం కావడం, గిరిజన ప్రాంతం కావడం ఒక రకంగా ఈ ఛానెల్ సక్సెస్‌కు కారణాలు. సరైన వంట సామాన్లు లేకుండానే చేసిన వంటకాలను ఐజక్ కుటుంబం తింటూ కనిపించడం, అడవిలోకి వెళ్లి అక్కడి ప్రజల జీవనశైలి, అరుదైన మొక్కలు, చెట్ల గురించి కూడా చూపించడం వంటివి వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
లక్షల్లో సంపాదన
తనకున్న కొద్దిపాటి నాలెడ్జ్‌తోనే ఐజక్ వీడియోలు పెడుతున్నాడు. వాటిలో హిందీతోపాటు స్థానిక భాష మాట్లాడతాడు. కొద్దికాలంలోనే ఈ ఛానెల్‌కు సబ్‌స్ర్కైబర్స్ పెరిగారు. ప్రస్తుతం ఏడున్నర లక్షలమంది వరకు సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్ గత మార్చిలో మొదలవగా, ఆగస్టులో అతడికి యూట్యూబ్ నుంచి తొలి సంపాదన అందింది. అది కూడా ఐదు లక్షల రూపాయలు కావడం విశేషం. అలా మొదటిసారే మంచి ఆదాయం రావడంతో ఇంటిని బాగు చేసుకున్నాడు. అప్పట్నుంచి మంచి సంపాదనే వస్తోంది. ఒకప్పుడు సరైన వసతులు లేని ఇంట్లో ఇప్పుడు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. తన సంపాదనలో నుంచి కొంత డబ్బును ఇతరులకు కూడా సాయం కోసం ఖర్చు పెడుతున్నట్లు చెప్పాడు ఐజక్.