ఒడిశా రాష్ట్రం కేంద్రపరా జిల్లాలోని గరద్‌పూర్‌లో ఓ పాఠశాలపై పిడుగు పడింది. కుదనగారి ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులు తరగతి గదిలో నుంచి బయటకు వస్తున్న సమయంలో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరూ 6వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వారిని మెరుగైన చికిత్స కోసం కేంద్ర పరా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థులు తమ తరగతిలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో కొందరు వెంటనే స్పృహ కోల్పోయారు. మరి కొందరు తలవంచుకుని విచిత్రంగా ప్రవర్తించారు. పిడుగుపాటకు తరగతి గదిలో షార్ట్ సర్య్కూట్ చెలరేగింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 14 మంది బాలురు , ఇద్దరు బాలికలున్నారు. విద్యార్థుల్లో ఇద్దరి విద్యార్థులు అమృత పాండా, అద్వాసా లక్ష్మీ సమల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
పిడుగు పడిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు విద్యార్థులను పటాకురా ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కేంద్రపరా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.