- కేరళ నుంచి ఒడిశాకు వచ్చేందుకు సోనూసూద్ హెల్ప్
- వైరల్ అవుతున్న ఫొటో
భువనేశ్వర్: లాక్‌డౌన్ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసు చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. కాగా..సోనూసూద్ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్ అనే వలస కార్మికుడు తన అభిమానాన్ని చాటుకున్నారు. సొంత ఊరిలో వెల్డింగ్ షాప్ పెట్టి దానికి సోనూసూద్ పేరు పెట్టారు. ఆ ఫొటో నెటింట్లో విపరీతంగా వైరల్ అయింది. “ నేను కొచీ ఎయిర్‌పోర్ట్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్నాను. రోజుకు రూ.700 సంపాదించేవాడిని. లాక్‌డౌన్ కారణంగా పనులు లేకుండా పోయాయి. శ్రామిక్ రైలులో సీటు దొరకలేదు. సోనూసూద్ గారి సాయంతో సొంత ఊరికి చేరుకున్నాను. మమ్మల్ని కాపాడిన దేవుడు సోనూసూద్. అందుకే షాప్‌కు ఆయన పేరు పెట్టుకున్నాను” అని ప్రశాంత్ చెప్పారు. దీనిపై సోనూసూద్ స్పందించారు. “ నా పేరు పెట్టుకునేందుకు ప్రశాంత్ పర్మిషన్ అడిగారు. నేను చాలా బ్రాండ్‌లకు అంబాజిడర్‌గా ఉన్నాను. కానీ ఇది చాలా ప్రత్యేకమైంది” అని సోనూసూద్ అన్నారు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చాలా మంది వలస కార్మికులకు హెల్ప్ చేసిన విషయం తెలిసిందే.