- సస్పెండ్ చేసిన ఒడిశా సర్కార్
భువనేశ్వర్: లాక్ డౌన్ బ్రేక్ చేసి పూరీ జగన్నాథ ఆలయంలోకి వెళ్లిన ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీపక్ కుమార్ జెనా ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా బడచానా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ (ఇన్ చార్జ్) గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి అధికారిక వాహనంలో పూరీ బయలుదేరాడు. కటక్, ఖోర్ధా జిల్లాల మీదుగా పూరీ చేరుకున్నాడు. ఆలయం గేటు వద్ద ఇన్ స్పెక్టర్, అతడి ఫ్యామిలీని ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. అయినా వారంతా బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇన్ స్పెక్టర్ దీపక్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ అభయ్ సోమవారం ప్రకటించారు. లాక్ డౌన్ సందర్భంగా జిల్లాల బౌండరీలు సీల్ చేసినా.. ఇన్ స్పెక్టర్ దీపక్ కుమార్ మూడు జిల్లాల బౌండరీలు దాటారని, అతడిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలో రోజుకు వందకుపైగా లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని, వాహనాలు సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు గత నెల 24న ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించినప్పట్నుంచి పూరీ ఆలయంలోకి భక్తులకు అనుమతించడం లేదు. అయితే నిత్యపూజలు మాత్రం నిరాటంకంగా జరుగుతున్నాయి.