ప్రపంచం ఎంతటి పురోగతి సాధించినా.. మూఢనమ్మకాలు, దురాచారాలు అంతరించపోవడం లేదు. కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటూ మూర్ఖంగా నరబలికి పాల్పడ్డాడో పూజారి. గుడి లోపలే గొడ్డలితో తల నరికి ఒక మనిషి నిండు ప్రాణం తీశాడు. ఆ తర్వాత వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
దేవుడు కలలో కనిపించి చెప్పాడు..
కటక్ జిల్లా బందహుడా గ్రామంలోని ఓ గుడి పూజారి సన్సారీ ఓజా (72) అదే ఊరికి చెందిన సరోజ్ కుమార్ ప్రధాన్ (52) అనే వ్యక్తిని గుడిలో బలిచ్చాడు. బుధవారం రాత్రి గొడ్డలితో తల నరికి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కరోనా వైరస్ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు దేవుడు కలలో కనిపించి చెప్పాడంటూ తెల్లారి వెళ్లి గురువారం ఉదయం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు ఆ పూజారి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు ఓజాను విచారించగా.. దేవుడు కలలోకి వచ్చి చెప్పడం వల్లే తాను అలా చేశానని చెప్పాడు. అయితే ఈ దారుణానికి పాల్పడిన సమయంలో నిందితుడు ఫుల్లుగా తాగేసి ఉన్నాడని, తెల్లారాక తప్పు తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెబుతున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని వెల్లడించారు.
ఆస్తి వివాదం వల్లే హత్య!
కరోనా మహమ్మారిని అంతం చేయడం కోసం నరబలి ఇచ్చానని పూజారి ఓజా చెబుతుండగా.. ఆ ఊరి జనం మాత్రం ఇది కావాలని చేసిన హత్య అని చెబుతున్నారు. సరోజ్ కుమార్ కు, ఓజాకు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని, దానిని మనసులో పెట్టుకుని ఈ హత్య చేసి ఉండొచ్చని అంటున్నారు.