ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్ పట్నాయక్ సర్కార్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాసోర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వడదెబ్బ బారిన పడ్డాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రూ. 50 వేల నష్టపరిహారం మంజూరు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వడగాలుల కారణంగా 20 మంది వరకు మృతి చెందారని ఆరోపణలు వచ్చాయి.
వారిలో ఒకరి మృతిని అధికారులు నిర్ధారించగా, మిగతా వారి వివరాలను కలెక్టర్లు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. రానున్న మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వేడి గాలులు కొనసాగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అధిక తేమ పరిస్థితులు ఉండగా, పశ్చిమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాజధాని భువనేశ్వర్లో ఉదయం 8.30 గంటలకు అత్యధికంగా 37.4 డిగ్రీలు నమోదైంది.