ఒక ఇంట్లో ఒకరు చనిపోయారంటేనే తట్టుకోవడం కష్టం.. ఆ మనిషిని మరిచిపోవడానికి కొన్ని సంవత్సరాల టైమ్ పడుతుంది. అలాంటింది ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోతే ఎలా ఉంటుంది. ఒడిశాలో ఇలాంటి సంఘటనే జరిగింది. రోడ్డు ప్రమాదంలో తన అన్న, మేనల్లుడు మృతి చెందారనే వార్త విన్న కొద్దిసేపటికే ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఒడిశాలో కెందుజార్ జిల్లాలోని బరిగావ్ గ్రామంలో జరిగింది. బాధితుడిని 55 ఏళ్ల సమర ముండాగా గుర్తించారు. అతని అన్న కండే ముండా (57), మేనల్లుడు లక్ష్మణ్ (35) మరణించారు.
కండె, లక్ష్మణ్ బైక్ పై వీక్లీ మార్కెట్‌కు వెళ్తున్న టైమ్ లో గ్రామ సమీపంలో బైక్ ను ఇనుము లోడ్ తో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అతని సోదరుడు, మేనల్లుడు ప్రమాదం మరణం గురించి విన్న సమారా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమర ముండా టీబీతో బాధపడుతున్నట్లు సమాచారం.
ప్రమాదంలోఇద్దరు మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.