బాలాసోర్: ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి శనివారం ఉదయం నుంచి ప్రమాద స్థలంలోనే మకాం వేసిన ఆయన రెస్క్యూ, రీస్టోరేషన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ‘‘రీస్టోరేషన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది. సిబ్బంది రాత్రీపగలు కష్టపడుతున్నారు. ఇప్పటివరకు సింగిల్ లైన్ ట్రాక్ వర్క్, సిగ్నలింగ్ సిస్టమ్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.
ప్రస్తుతం ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ పనులు కొనసాగుతున్నాయి. ఇవి కూడా త్వరగానే పూర్తవుతాయి. మంగళవారం కల్లా రైళ్ల రాకపోకలు ప్రారంభించే అవకాశం ఉంది” అని వైష్ణవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ట్రాకుల మీద నుంచి ధ్వంసమైన బోగీలను తొలగించామన్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ స్థానంలో ఆదివారం మధ్యాహ్నం భద్రక్ స్టేషన్ నుంచి కటక్, భువనేశ్వర్ మీదుగా చెన్నైకి స్పెషల్ ట్రెయిన్ బయలుదేరిందని, యాక్సిడెంట్ బాధితులు, వారి బంధువుల కోసం ఈ ట్రెయిన్ ను నడుపుతున్నామని చెప్పారు.