ఒడిశా రైలు ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
వారిని తీసుకువెళ్లేందుకు బంధువులు ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఆధార్, ఫింగర్ ప్రింట్,ఫేస్ రికగ్నిషన్ తో డెడ్ బాడీలను గుర్తి్ంచేందుకు ప్రయత్నిస్తు్న్నామని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నట్లుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు.
ఒడిశా రైలు ప్రమాదంలో 1,100 మంది గాయపడ్డారని వారిలో 900 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన 278 మందిలో 101 మృతదేహాలు ఇంకా మిగిలి ఉన్నాయని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్ రాయ్ తెలిపారు.
BMC హెల్ప్‌లైన్ నంబర్ 1929కి ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ కాల్‌లు వచ్చాయని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే తెలిపారు. భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాల్లో 80 మృతదేహాలను గుర్తించామని.. 55 మృతదేహాలను బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు.
2023 జూన్ 2న బాలాసోర్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒక గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 278 మంది ప్రాణాలు కోల్పోయారని, 1100 మందికి పైగా గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు.