ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన అనే యువకుడు తన తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి వచ్చాడు. తిరిగి చెన్నైకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్తుండగా 2023 జూన్ 2 శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. అతడి మృతదేహం కోసం అతని ఇద్దరు సోదరలు వెతకగా ఇంతవరకు అతని డెడ్ బాడీ కనిపించలేదు.
రమేశ్ జెన 14 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తల్లి చనిపోయాక 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం తల్లి పెద్దకర్మ జరిగింది. అనంతరం తిరిగి చెన్నై బయలుదేరాడు. 2023 జూన్ 2 శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అయితే.. రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందని రమేశ్ సోదరలు తెలుసుకున్నారు.
దీంతో వెంటనే అతనికి ఫోన్ చేశారు. రమేశ్‌కు ఫోన్ చేయగా తీయలేదు. దీంతో కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా ఎవరో వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రమేశ్ మృతి చెందాడని, అతని ప్యాంటు జేబులో ఈ ఫోన్ ఉందని తెలిపాడు. దీంతో వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చిన రమేష్ ఇద్దరు సోదరులు అతని కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి అన్నీ ఆసుపత్రుల్లోనూ తమ సోదరుడి మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.