ఒడిశా రైలు ప్రమాదం జరిగిన మూడు రోజుల అనంతరం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు బతికే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లు భువనేశ్వర్‌లోని ఏఎంఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హజారి బెహిరా సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా, మరో లోకో పైలెట్ డ్రైవర్ జీఎన్ మోహంతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ తాను చూసిన గ్రీన్ సిగ్నల్ ఆధారంగానే ముందుకు వెళ్లినట్లు తెలిపాడని రైల్వే బోర్డు సభ్యురాలు జయ వర్మ సిన్హా మీడియాకు వెల్లడించారు. 'మేము కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాం. అతను తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రైలు ముందుకు కదిలిందని మాతో తెలిపాడు. ఇక్కడ దృశ్యాలను చూసినట్లయితే రైలు అతివేగంగా వెళ్లలేదు. అతను సిగ్నల్ జంప్ చేయలేదు' అని బోర్డు సభ్యురాలు సిన్హా తెలిపారు. మరోవైపు ప్రమాదానికి ముందు హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ భారీ శబ్దం విన్నట్లు తెలిపారని ఆమె మీడియాకు వెల్లడించారు.
అయితే ఈ ప్రమాదానికి లోకో పైలెట్, అతని అసిస్టెంటే కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమకు ప్రైవసీ ఇవ్వాలని మీడియాను వేడుకుంటున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాల విషయంలో లోకో పైలెట్లతో ఎటువంటి సంబంధం ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. సిగ్నల్ ఆపరేషన్లు సెక్షన్ ఆఫీసర్లు, సెక్షన్ హెడ్స్, స్టేషన్ మాస్టర్ ఆధీనంలో ఉంటాయని ఓ రైల్వే అధికారి తెలిపారు.