ఆర్గానిక్​ ఫార్మింగ్​ వైపు.. ఒడిశా

ఆర్గానిక్​ ఫార్మింగ్​ వైపు.. ఒడిశా

ఆరోగ్యకరమైన పంటల్ని పండించే సహజమైన సాగు పద్ధతులనే ఆర్గానిక్​ ఫార్మింగ్​ అంటారు. ఇండియాలో ఈ వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నా,  పంట విస్తీర్ణం ఆ రేంజ్​లో లేదు. ప్రపంచవ్యాప్తంగా 5.78 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో నేచురల్​గా​ పంటలు పండిస్తుంటే మన దేశంలో మాత్రం 15 లక్షల హెక్టార్లలోనే సాగు చేస్తున్నారు. ఈ లోటు భర్తీకి ఈమధ్య ఇండియా ఆర్గానిక్​ ఫార్మింగ్​పై ఆసక్తి చూపుతోంది. సిక్కిం తర్వాత కేరళ, అరుణాచల్​ఫ్రదేశ్​, రాజస్థాన్​ ఇటువైపు ఫోకస్​ పెడుతున్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు ఒడిశా కూడా చేరింది.

ఒడిశాలో అభివృద్ధిలో అగ్రికల్చర్​ సెక్టార్​ వాటా 30 శాతం చిల్లరే. అలాగని అక్కడ సేద్యం చేసేవాళ్లు లేరనుకుంటే పొరబాటు. 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు.  ఈ పర్సంటేజీని పెంచటానికి నవీన్​ పట్నాయక్​ (బీజేడీ) ప్రభుత్వం ఆర్గానిక్​ ఫార్మింగ్​పై దృష్టి పెట్టింది.  ఈ మేరకు ఒక పాలసీ రూపొందించింది. ఇప్పుడు ‘పరంపరాగత్​ కృషి వికాస్​ యోజన (పీకేవీవై)’ని ప్రారంభించింది. మొత్తం 30 జిల్లాల్లో సుమారు 30 శాతం పొలాలను ఈ పథకం కింద సెలెక్ట్​ చేసింది.

ఆసక్తి ఉంటే అన్నీ నేర్పుతారు

పీకేవీవై స్కీమ్​ కోసం ఎనిమిది జిల్లాల్ని ఎంపిక చేసింది. కంధమాల్​, కలహండి, రాయగడ, గజపతి, నయాగఢ్​, కొరాపుట్​, మయూర్​భంజ్​, కియోన్జహర్​ జిల్లాల్లో ఒక్కో చోట 250 హెక్టార్ల భూమిని ఆర్గానిక్​ ఫార్మింగ్​కి కేటాయిస్తారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆపరేషనల్​ గైడ్​లైన్స్​ని సర్కార్​కి అందజేసింది. గవర్నమెంట్​ నుంచి గ్రీన్​సిగ్నల్​ రాగానే కార్యక్రమం అమలును ముమ్మరం చేయనుంది. అప్పటివరకు క్లస్టర్​ అప్రోచ్​లోనే ముందుకు సాగనుంది. ఈ విధానంలో మొదట ఆర్గానిక్​ ఫార్మింగ్​ గ్రూపులతో 20 హెక్టార్ల చొప్పున క్లస్టర్​ ఏర్పాటుచేస్తారు.

గ్రూపు సభ్యులకు ఈ కొత్త వ్యవసాయంపై ట్రైనింగ్​ ఇస్తారు. ఇప్పటికే ఈ పద్ధతిలో సాగు చేస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి చూపిస్తారు. తప్పొప్పులకు తావు లేకుండా ట్రాన్స్​పరెంట్​ మేనర్​లో సర్వీస్​ ప్రొవైడర్లను సెలెక్ట్ చేస్తారు. వాళ్ల ఆధ్వర్యంలోనే రైతులకు ఫీల్డ్​ విజిట్​లు ఏర్పాటుచేస్తారు. సర్వీస్​ ప్రొవైడర్లు రిసోర్స్​ పర్సన్లను లీడ్​ చేస్తారు. ఆర్గానిక్​ ఉత్పత్తుల ప్యాకేజింగ్​, లైసెన్సింగ్​ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రొడక్ట్​ల అమ్మకానికి సంతలు నిర్వహిస్తారు. పబ్లిసిటీతోపాటు మార్కెటింగ్​ మెలకువలు నేర్పుతారు.      ​

ఒక్కో గ్రూపుకి రూ.10 లక్షలు

పరంపరాగత్​ కృషి వికాస్​ యోజన(పీకేవీవై) ప్రాజెక్టును రూ.178 కోట్లతో ఐదేళ్లు అమలుచేయాలని హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ అనుకుంటోంది. ముఖ్యంగా గిరిజన, కొండ ప్రాంతాలతోపాటు వర్షాలపైనే ఆధారపడ్డ ఏరియాల్లో ఆర్గానిక్​ ఫార్మింగ్​ చేపడతారు. మొక్కల పెంపకం, సహజ ఎరువుల తయారీకి కావాల్సిన ముడి సరుకు కొనుగోలు, వర్మి కంపోస్ట్​ తదితర ఖర్చులకు ఆఫ్​ ఫామ్​, ఆన్​ ఫామ్​ ఇన్​పుట్​ సబ్సిడీలను రైతుల అకౌంట్లకే డైరెక్ట్​ బెనెఫిట్​ ట్రాన్స్​ఫర్​ (డీబీటీ) మోడ్​లో రిలీజ్​ చేస్తారు. క్లస్టర్​లోని ఒక్కో గ్రూపుకి రూ.10 లక్షలను మూడు విడతల్లో ఇస్తారు. బడ్జెట్​ను బట్టి ఈ సంవత్సరం రూ.3 కోట్లతో 1500 హెక్టార్లలో (75 క్లస్టర్లలో) ఆర్గానిక్​ ఫార్మింగ్​ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ‘మిషన్​ ఫర్​ ఇంటిగ్రేటెడ్​ డెవలప్​మెంట్​ ఆఫ్ హార్టికల్చర్​​’లో భాగంగా ఆర్గానిక్​ ఫార్మింగ్​ సర్టిఫికేషన్​ కోసం హార్టికల్చర్​ డైరెక్టరేట్​ ఆసక్తి గల ఏజెన్సీల నుంచి ప్రపోజల్స్​ ఆహ్వానించింది. రైతులకు సాగు నష్టాల్ని తగ్గించాలని, ఇన్​కం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

సిక్కింలో ఫస్ట్ టైమ్

పాత రోజుల్లో రైతులు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయమే చేసేవారు. పశువుల వ్యర్థాలను ఎరువుగా వాడేవారు. ఇప్పుడంతా ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్​, గ్రోత్​ రెగ్యులేటర్స్​, జెనెటికల్లీ మోడిఫైడ్​ ఆర్గానిజమ్స్​నే చల్లుతున్నారు. అవి లేకుంటే పంటలు పండించటం అసాధ్యం అనుకుంటున్నారు. దీనివల్ల ఒక వైపు పెట్టుబడి పెరుగుతుంటే మరో వైపు దిగుబడి దిగజారుతోంది. ఫలితంగా అప్పులపాలై, వాటిని తీర్చలేక, చివరికి సూసైడ్​ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది.

సిక్కిం రైతులు దీనికి భిన్నంగా ఆలోచించారు.  ఆ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా ఆర్గానిక్​ ఫార్మింగ్​ను మొదలుపెట్టింది. అక్కడి రైతులు 16 ఏళ్ల కిందటే రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం ఆపేశారు. ఆ తర్వాత కేరళ, రాజస్థాన్​, అరుణాచల్​ప్రదేశ్​తోపాటు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఈ బాట పట్టాయి. ఇందులో భాగంగా ఒడిశా పీకేవీవై ప్రోగ్రామ్​ పెట్టింది. దీనికోసం కొత్త ఆపరేషనల్​ గైడ్​లైన్స్​ అమలుచేయాలని చూస్తోంది. ఆర్టిఫిషియల్​గా తయారుచేసిన మందుల వాడకాన్ని బంద్​ చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి