సొంతవాళ్లను కాదని.. రిక్షావాలాకు రూ.కోటి ఆస్తి

సొంతవాళ్లను కాదని.. రిక్షావాలాకు రూ.కోటి ఆస్తి

బెల్లం చుట్టే ఈగలు చేరుతాయన్న పెద్దల మాట ప్రకారం.. ఆస్తుపాస్తులు ఉంటేనే చుట్టాలు బంధువులు చుట్టూ చేరుతారు. మనం చచ్చినా పట్టించుకోని చుట్టాలు.. మనం చస్తే మాత్రం ఆస్తులు కోసం ఆరా తీస్తారు. అయితే కోట్లు, లక్షల్లో ఆస్తులు ఉన్నా కూడా అయినవాళ్లు పట్టించుకోకుండా అనాథలుగా చాలామంది బతుకుతున్న రోజులివి. అందుకే ఓ మహిళ తన కోటి రూపాయల ఆస్తిని సొంత వాళ్ల కోసం కాకుండా... ఓ రిక్షా వాడికి రాసిచ్చింది. తాన చావు అనంతరం తన ఆస్తి రిక్షావాడికే దక్కుతుందని తేల్చి చెప్పింది. 

వివరాల్లోకి వెళ్లే... ఒడిశాకు చెందిన మినతి పట్నాయక్ వయసు 63 ఏళ్లు. భర్త కూతురితో కలిసి జీవిస్తుండేది. అయితే  మినతి పట్నాయక్ భర్త కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో గత  ఏడాది చనిపోయారు. ఆ తర్వాత కూతురితో కలిసి బతికేది. అయితే ఇటీవల కూతురు కూడా గుండె పోటు కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒంటరిగా ఉన్న ఆమెకు రిక్షా నడుపుతూ బతుకుతున్న బుధ సామల్ కుటుంబం అండగా నిలిచింది. ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొన్నారు. దాదాపు 25 ఏళ్లుగా సామల్ కుటుంబం మినాతి పట్నాయక్ కుటుంబానికి సేవ చేస్తుంది. ఆమె కూతుర్ని కూడా బుధ సమాల్ తన రిక్షాలోనే స్కూల్, కాలేజీకి తీసుకెళ్లేవాడు. 

మరోవైపు భర్త, కూతురు చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నా పట్టించుకోని బంధువులు ఆస్తి కోసం రాబంధువుల్లా చుట్టూ చేరడం ప్రారంభించారు. దీంతో ఆమె ఆస్తి కోసమే అంతా తన వద్దకు వస్తున్నారని భావించింది. దీంతో వెంటనే సామల్ కుటుంబాన్ని పిలిపించింది. తన చావు అనంతరం తన ఆస్తి మొత్తం సామల్ కుటుంబానికే దక్కాలని ప్రకటించింది. ఆస్తితో పాటు, ఆభరణాలు కూడా వారికి ఇవ్వాలని చెప్పింది. అందుకు అవసరమైన అన్ని చట్టపరమైన విధానాల్నికూడా మినతి తీసుకున్నారు.