సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్… లాక్‌డౌన్ పిరియడ్‌లో వేలాది మంది వలస కూలీలను సొంతూళ్లకు చేర్చి హీరోగా మారిపోయాడు. సోనూసూద్ లాగే మరో నటుడు కూడా లాక్‌డౌన్‌లో పేదలకు ఎంతో సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన సినీ హీరో సభ్యసాచి మిశ్రా కూడా సోనూసూద్‌లా పేదలకు తన వంతు సాయం చేస్తున్నాడు. ఒడిశాలో మిశ్రాకు మంచి గుర్తింపే ఉంది. మిశ్రాకు ‘స్మైల్ ప్లీజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారానే తన సేవా కార్యక్రమాలను చేపడుతున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలతో చిక్కుకున్న వందలమందిని తన సొంత ఖర్చుతో ఒడిశాకు చేర్చాడు. లాక్‌డౌన్ సమయంలో రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన ఓ విద్యార్థి సోషల్ మీడియా ద్వారా సవ్యసాచిని సాయం కోరాడు. ఆ విద్యార్థి తన స్వగ్రామం చేరుకునేలా సాయమందించాడు. ఇక అప్పట్నించి సాయం చేయమంటూ మిశ్రాకు వినతులు వెల్లువలా రావడం మొదలైంది. అలా తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్‌లలో చిక్కుకుపోయి.. మిశ్రా సాయంకోరిన విద్యార్థులందరినీ ప్రత్యేక బస్సులలో వారి స్వస్థలాలకు చేర్చాడు. ఒడిశా యువతి గుంటూరు జిల్లా బాపట్లో యజమాని చెరలో చిక్కుకొని.. చిత్రహింసలు పడింది. యువతి తల్లి ఈ విషయాన్ని మిశ్రా దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఆయన పోలీసుల సాయంతో యువతిని కాపాడి తల్లి వద్దకు చేర్చాడు.
అంతేకాకుండా దుబాయ్‌లో చిక్కుకున్న 189 మందిని కూడా ప్రత్యేక విమానంలో ఒడిశాకు చేర్చాడు. కరోనా కారణంగా ఆగిపోయిన పెళ్లిళ్లను జరిపించాడు. పేదవారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. ఇలా తన సేవా కార్యక్రమాలతో సినిమాల్లోనే కాకుండా.. నిజజీవితంలోనూ మిశ్రా హీరో అనిపించుకుంటున్నాడు. దాంతో మిశ్రాను ఒడిశా వాసులందరూ సోనూసూద్‌తో పోలుస్తున్నారు.
For More News..