84 గ్రామాల ఊసే లేని 69 జీవో ఉత్తదే

84 గ్రామాల ఊసే లేని 69 జీవో ఉత్తదే
2014లో చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్​ జీవో111 గురించి మాట్లాడారు. ఈ జీవో వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా దాన్ని ఎత్తివేస్తామని,  ఎకరాకు రూ.20 కోట్ల ధర వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా అటువైపు వెళ్లినప్పుడల్లా జీవో111 ఎత్తివేస్తామని అనేకసార్లు ప్రకటనలు చేశారు. 84 గ్రామాల ప్రజల కష్టాలకు పరిష్కారంగా111 జీవో రద్దు చేసి 69 జీవో తెచ్చిన  ప్రభుత్వం, తీరా అందులో ప్రజల ఇబ్బందుల గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం దారుణం. ఎవరికీ ఉపయోగం లేని పద్ధతిలో 69 జీవోను తీసుకొచ్చారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల విషయంలో కనీస అవగాహన లేకుండా, ప్రజా సంక్షేమం పట్టకుండా, పర్యావరణ స్పృహ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కారు దుందుడుకు చర్యను రియల్​ఎస్టేట్ ​పరిశ్రమ కూడా హర్షించడం లేదు. పర్యావరణం కాపాడే విధంగా నిబంధనలను కోరుతున్నది. కొత్త నిబంధనలు తీసుకు వచ్చిన తర్వాతే జీవో 111 ఎత్తివేసి ఉంటె బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. జీవో 69లో ఏముంది అని తెలుసుకోవడానికి కనీసం దాన్ని ప్రజలకు అందుబాటులో కూడా ఉంచడంలేదు. ప్రజలు అర్థం చేసుకోవడానికి తెలుగులోకి తర్జుమా చేయలేదు. ఆ ప్రాంత గ్రామ పంచాయతీలకు జీవో ప్రతులు పంపలేదు. బాధిత గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేయాలనే కనీస బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం.

అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు
రంగారెడ్డి జిల్లాలో అనేక మంది చిన్న, సన్నకారు రైతులు హైదరాబాద్ అభివృద్ధి పేరిట ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలకు, పారిశ్రామిక పార్కులకు, రోడ్లకు, ల్యాండ్ పూలింగ్ తదితర ప్రాజెక్టులకు ఎకరాల కొద్దీ భూమి ఇచ్చి పేదలుగా, కూలీలుగా రోడ్డున పడ్డారు. ఊరు వదిలి వలస బాట పట్టారు. హైదరాబాద్ అభివృద్ధికి భూములు ఇచ్చి పేద, దళిత, బలహీన వర్గాల కుటుంబాలు సమిధలుగా మారాయి.  ప్రైవేటు వ్యక్తులు కూడా అసైన్డ్ భూమి యజమానులను మభ్యపెట్టి, మోసం చేసి, భూమి బదలాయింపు చేసుకున్నారు. జీవో111 వల్ల 84 గ్రామాల్లో రైతులు అటు వ్యవసాయం చేసుకోలేక, ఇటు భూమి అమ్ముకోలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆయా గ్రామాల్లో భూమి లేని పేదల పరిస్థితి ఇంకా ఘోరం. వ్యవసాయం లేక ఉపాధి పోయింది. గేటెడ్ ఫాం హౌస్​లలో కొందరికే ఉపాధి దొరికింది. సంప్రదాయ జీవనోపాధులు కనుమరుగయ్యాయి. చదువు, వైద్యం అందుబాటులో లేక ఇప్పటికీ ఆయా కుటుంబాలు పేదరికంతో అలమటిస్తున్నాయి. చుట్టూ పెద్ద భవనాలు, రోడ్లు, పడవల్లాంటి కార్లు తిరుగుతున్నా.. ఇవేవీ పేదల జీవితాల్లో మార్పు తీసుకురాలేదు. 84 గ్రామాల్లో ఉన్న మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి అధ్వానంగా మారింది. తాతల కాలం నుంచి ఊర్లోనే ఉంటున్నా, గుంట భూమి లేని వాళ్లు ఎందరో ఉన్నారు. భూముల ధరలు పెరిగిన కొద్దీ వీరు ఇల్లు లేక, పని దొరకక సొంత ఊర్లో ఉండలేక వలస బాటపట్టారు. వ్యవసాయ భూమి లేని, సొంత ఇంటికి జాగలేని, ఇండ్లు లేని కుటుంబాలు జీవో 111 ఆంక్షలతో ఒక జీవితకాలం నష్టపోయారు. ఇలాంటి కుటుంబాలకు శాసనసభలో సీఎం ప్రకటన కొంత ఆశ కల్పించింది. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని భావించాయి. అయితే మంత్రివర్గ సమావేశంలో 111 జీవో రద్దు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించినా.. 84 గ్రామాల ప్రజల గురించి చెప్పలేదు. అంటే, మంత్రివర్గ భేటీలో బాధిత గ్రామాల గురించి, గ్రామస్తుల త్యాగాల గురించి కనీస ప్రస్తావన లేదని తెలుస్తోంది. 

ఇంతకీ 69 జీవోలో ఏముంది?
జీవో 69 లో 111 జీవోలోని మూడో పేరాను రద్దు చేస్తున్నట్లు ఉంది. అయితే ఒక్క పేరా మినహా జీవో111ఇంకా సజీవంగానే ఉందా అనే భ్రమ కలుగుతుంది. ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు, కమిటీ పరిశీలించాల్సిన అంశాలు జీవోలో ఉన్నాయి. అయితే వాటిలో బాధిత 84 గ్రామాలు, గ్రామస్తుల గురించిన కనీస ప్రస్తావన లేదు. చెరువుల పరిరక్షణకు అవసరమైన మౌలిక పెట్టుబడులకు(పైప్ లైన్లు) నిధుల సేకరణ బాధ్యత కమిటీలకు ఇచ్చినట్లు జీవోలో పేర్కొన్నారు. అయితే 84 గ్రామాల ప్రజల అభివృద్ధికి సంబంధించి ఎటువంటి నిధుల ప్రతిపాదన లేదు. వారి నష్టానికి పరిహారం ఇస్తామని, ఇవ్వాలని కూడా జీవోలో ఎక్కడా లేదు. దీన్ని బట్టి, జీవో 111 ఎత్తివేత 84 గ్రామాల అభివృద్ధి కోసం అని చెబుతున్న మాట ఉత్తదే అని తేలిపోయింది.జీవో111 ఆంక్షల ఎత్తివేసినా, వాటి స్థానంలో జోనల్ నియంత్రణ నిబంధనలు తీసుకు రాలేదు. అంటే, జీవో 111 పరిధిలో రియల్ ఎస్టేట్ దందా ఇష్టానుసారంగా చేసుకోవడానికి జీవో 69 ఆస్కారం కల్పించినట్లు స్పష్టమవుతోంది. భూ దోపిడీకి, దళారీ వ్యవస్థకు అవకాశం కల్పిస్తున్నట్లుగా అర్థమవుతోంది. కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ఆంక్షలు వస్తాయని చెబుతున్న ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియకు కాల పరిమితి విధించకపోవడం గమనార్హం. దీంతో జీవో 69 కమిటీ తన నివేదిక ఇస్తుందా, ప్రభుత్వం కొత్త నిబంధనలు/ ఆంక్షలు తీసుకు వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కమిటీ నివేదిక ఇచ్చి, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, కొత్త నిబంధనలు విధించేలోపు 84 గ్రామాల పరిధిలో జంట జలాశయాల ఉనికికే ప్రమాదం తెచ్చేలా నిర్మాణాలు జరిగితే వాటికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్