ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు

ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు
  • సర్వే డ్యూటీలో పాల్గొంటున్న ప్రైమరీ స్కూల్ టీచర్లు
  • 50 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో సర్వే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు ఒంటి పూట పని చేయనున్నాయి. సర్కార్ చేపడ్తున్న సర్వేలో టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. గవర్నమెంట్, ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లలోని ఎస్జీటీలు, నాన్ టీచింగ్ స్టాఫ్​కు సర్వే డ్యూటీలు వేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ప్రైమరీ స్కూళ్లు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఆ తర్వాత అందరూ సర్వేలో పాల్గొనాలని సూచించారు. 

మధ్యాహ్న భోజనం తర్వాత స్టూడెంట్లను స్కూల్ నుంచి పంపిచేస్తారు. 20వేలకు పైగా ఉన్న ప్రైమరీ స్కూల్స్​లో పనిచేసే సుమారు 50వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు. వీరిలో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 పీఎస్ హెచ్​ఎంలు, ఎంఈవో ఆఫీసుల్లో పని చేసే 6,256 మంది సిబ్బంది, 2వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. సర్వే నుంచి మినహాయింపు ఉన్న ఉపాధ్యాయులందరూ స్కూల్స్​లోనే ఉండాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వేలో టీచర్లు పాల్గొనని అన్ని స్కూల్స్.. రెగ్యులర్ టైమ్సింగ్ పాటించాలని సూచించారు.