
బషీర్బాగ్, వెలుగు: జాబ్ పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 28 ఏండ్ల యువకుడు ఇటీవల ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్ పూర్తి చేశాడు. తన రెస్యూమ్ జాబ్ సర్చ్ పోర్టల్ లో ఉందంటూ అతనికి రెండు నెలల కింద ఒకరు కాల్ చేశారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి, బెంగళూరులోని ఆటోస్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ గా సెలెక్ట్ అయినట్లు తెలిపారు.
అనంతరం బాధితుడి మెయిల్ కు ఆఫర్ లెటర్ ను పంపించారు. అయితే, జాబ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని,15 రోజులకు ఆ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. వారి మాటలను నమ్మిన యువకుడు పలు దఫాలుగా స్కామర్ సూచించిన అకౌంట్ కు మొత్తం రూ.1,39,584 ను బదిలీ చేశాడు. ఆ తర్వాత జాయినింగ్ డేట్ ను వాయిదా వేస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన బాధితుడు చెల్లించిన డబ్బులను రిటర్న్ చేయాలని కోరగా , కాల్స్ , మెయిల్స్ కు స్పందించడం మానేశారు. దీంతో మోసపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు సోమవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.