హైదరాబాద్, వెలుగు: ఏడాది క్రితం జీహెచ్‌ఎంసీలో అవుట్ సోర్స్‌లో ఇంజినీర్ ఉద్యోగాలంటే దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పాసయ్యారు. కొలువు వచ్చిందని ఆనందంతో ఎగిరి గంతేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి 175 మంది హైదరాబాద్ వచ్చి ఉద్యోగాల్లో చేరారు. జాబ్‌లో జాయిన్ అయిన మొదటి రోజే వారికి జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ ఉద్యోగ ప్రకటనకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి లేనందున నియామకాలు చెల్లవని బల్దియా అధికారులు తేల్చిచెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తర్వాత సమాచారమిస్తాం అని తెలిపారు.
ఏం చేయాలో అర్థం కాని నిరుద్యోగులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఏడాది గడచినా జీహెచ్‌ఎంసీ నుంచి స్పందన లేదు. మాట ఇచ్చి 14 నెలలు గడచినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ, సచివాలయం, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఎప్పటికయినా అధికారులు దారి చూపుతారనే ఆశతో అభ్యర్థులు తరచుగా జీహెచ్‌ఎంసీకి వచ్చి వినతిపత్రాలు ఇస్తూ పోతున్నారు.
సమస్య మొదలైందిలా..?
జీహెచ్‌ఎంసీలో నాలుగేళ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, భారీ ప్రాజెక్టులు చేపడుతున్నా ఇంజినీరింగ్ విభాగంలో సరిపడా స్టాఫ్ లేరు. రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలు చేసే పరిస్థితి లేదు. కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుందామంటే మళ్లీ రెగ్యులరైజ్ చేయాలనే తలనొప్పి ఉంటుంది. కానీ అవుట్ సోర్స్ ఉద్యోగాలైతే సమస్య ఉండదని భావించింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ సంస్థ అయిన రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్ ( ఆర్‌సీయూఈఎస్) ద్వారా నియామకం చేపట్టాలని నిర్ణయించింది. సాధారణంగా అవుట్ సోర్స్ సిబ్బందికి స్కిల్ ఉండటం లేదు. అందుకే పరీక్ష పెట్టి మరీ నియమించుకోవాలని భావించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ కోసమని చెప్పి, 2018 ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ జాబితా ఆధారంగా 2018 జూన్ 18న జూన్ 29న అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపారు. 2018 జులై 5న రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దాదాపు అందరూ వచ్చి రిపోర్ట్ చేశారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే అభ్యర్థుల నెత్తిన జీహెచ్‌ఎంసీ పిడుగువేసింది. అవుట్‌సోర్స్ పద్ధతిలో జరిగిన ఈ నియామకానికి రాష్ట్ర అనుమతి లేకపోవడం వల్ల నియామకం చెల్లదని అధికారులు తేల్చి చెప్పారు.
సాధ్యాసాధ్యాలు ఏంటి?
జీహెచ్‌ఎంసీ చెబుతున్న సాంకేతిక కారణాలను కొందరు అధికారులే కొట్టి పారేస్తున్నారు. బల్దియా అవసరాల మేరకు అవుట్‌సోర్స్ సిబ్బంది నియామకం చేపట్టవచ్చని అంటున్నారు. 175 మంది ఉద్యోగాలకు సంవత్సరానికి చెల్లించే జీతాలు రూ.5 కోట్లు దాటితేనే ప్రభుత్వ అనుమతి అవసరమని చెబుతున్నారు. కానీ వీరికి ఏడాదికి చెల్లించే జీతాల మొత్తం రూ.3 కోట్ల లోపే ఉంటుంది.