
న్యూఢిల్లీ: డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలం కొత్త సరఫరా ఒక శాతం తగ్గి 99 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ కొలియర్స్ తెలిపింది. దీని రిపోర్టు ప్రకారం...గత ఏడాది ఇదే కాలంలో ఆఫీసు స్థలం కొత్త సరఫరా కోటి చదరపు అడుగులుగా ఉంది.
బెంగళూరులో కొత్త సరఫరా మార్చి క్వార్టర్లో 16 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో 44 లక్షల చదరపు అడుగుల నుంచి 37 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. చెన్నైలో 3 లక్షల చదరపు అడుగుల నుంచి 2 లక్షల చదరపు అడుగులకు.. అంటే 33 శాతం తగ్గుదల కనిపించింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో సరఫరా 5 లక్షల చదరపు అడుగుల నుంచి 27 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఏడాది లెక్కన ఐదు రెట్లు పెరిగింది.
హైదరాబాద్‌లో కొత్త సరఫరా 26 లక్షల చదరపు అడుగుల నుంచి 3 లక్షల చదరపు అడుగులకు (88 శాతం) తగ్గింది. కోల్‌కతాలో కొత్త ఆఫీసు సరఫరా 50 శాతం తగ్గింది. ఇది 2 లక్షల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగులకు పడిపోయింది. ముంబైలో కొత్త ఆఫీసు స్థలం సరఫరా 10 లక్షల చదరపు అడుగుల నుంచి 4 లక్షల చదరపు అడుగులకు.. అంటే 60 శాతం తగ్గింది.
పూణేలో గత ఏడాది ఇదే కాలంలో 10 లక్షల చదరపు అడుగుల నుంచి ఈ ఏడాది జనవరి-–మార్చిలో 2.5 రెట్లు పెరిగి 25 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. 2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి క్వార్టర్లో ఈ ఏడు నగరాల్లో ఆఫీసు స్థలం స్థూల లీజింగ్ గత ఏడాది ఇదే కాలంలో 138 లక్షల చదరపు అడుగుల నుంచి ఈసారి15 శాతం పెరిగి 159 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.