భారీగా పెరిగిన ఆఫీస్ స్థలాల అద్దె.. హైదరాబాద్‎లో ఎంత హైక్ అయ్యిందంటే..?

భారీగా పెరిగిన ఆఫీస్ స్థలాల అద్దె.. హైదరాబాద్‎లో ఎంత హైక్ అయ్యిందంటే..?

న్యూఢిల్లీ: మన దేశంలోని ఏడు ముఖ్యమైన సిటీల్లో ఆఫీసు స్థలాల అద్దె 2024లో ఏడాది లెక్కన 4-8 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో నెలకు సగటు ఆఫీసు అద్దె 6.7 శాతం పెరిగి చదరపు అడుగుకు 1.6 డాలర్లకు (దాదాపు రూ.132.8) చేరుకుంది. ఢిల్లీలో నెలవారీ అద్దెలు 8.2 శాతం పెరిగి చదరపు అడుగుకు 0.9 డాలర్లకు చేరుకోగా, బెంగళూరు లో 4.7 శాతం పెరిగి చదరపు అడుగుకు 1.1 డా లర్లకు చేరుకున్నాయి. 2024లో పూణేలో సగటు నెలవారీ ఆఫీస్ అద్దె చదరపు అడుగుకు ఒక డాలర్ గా ఉంది. 

ఇది ఏడాది లెక్కన 4.5 శాతం పెరిగింది. చెన్నైలో నెలవారీ ఆఫీస్ అద్దె 2024లో చదరపు అడుగుకు 0.8 డాలర్లు ఉంది. ఇది ఏడాది లెక్కన 7.7 శాతం పెరిగింది. 2024లో హైదరాబాద్లో సగటు నెలవారీ ఆఫీస్ అద్దె 4.4 శాతం పెరిగి చదరపు అడుగుకు 0.8 దాలర్లకు చేరుకుంది. కోల్కతాలో సగటు నెలవారీ ఆఫీస్ అద్దె ఏడాది లెక్కన 3.8 శాతం పెరిగి చదరపు అడుగుకు 0.6 డాలర్లకు చేరుకుంది. కొత్త వ్యాపారాలు మొదలవ డం, కంపెనీ విస్తరణల వల్ల దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు గణనీయమైన డిమాండ్ పెరిగిందని వెస్టియన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస రావు అన్నారు.

 ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే బలమైన ఆర్థిక వృద్ధి, ఎక్కువ జనాభా, వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం. వేగ వంతమైన పట్టణీకరణ, తక్కువధరలకు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి దొరకడం వల్లఇంటర్నేషనల్ కంపెనీలు మనదేశంలో ఆఫీసు స్థలాన్ని ఎక్కువగా కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబైలోని బీకేసీ, ఢిల్లీ కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సగటు అద్దె నెలకు చదరపు అడుగుకు 3-4 డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు. 


విదేశీ మార్కెట్లలో ఇలా.. 

ఎనిమిది పెద్ద విదేశీ మార్కెట్లలో అద్దె వృద్ధిలో మిశ్రమ ధోరణి కనిపించిందని రియల్ కన్సల్టెన్సీ వెస్టియన్ తెలిపింది. దీని ప్రకారం, న్యూయార్క్ లో సగటు ఆఫీసు అద్దె 2024లో 1.3 శాతం తగ్గి నెలకు చదరపు అడుగుకు 7.5 డాలర్లకు (దాదాపు రూ.622) చేరుకుంది. షాంఘైలో నెలకు చదరపు అడుగుకు 2.8 డాలర్లకు, హాంకాంగ్ లో నెలకు చదరపు అడుగుకు 6.8 శాతం తగ్గి నెలకు 5.9 డాలర్లకు చేరుకుంది.

 సియాటెల్లో ఆఫీసు అద్దె 2024లో 1.9 శాతం తగ్గి నెలకు 4.7 డాలర్లకు చేరుకుంది. లండన్ లో సగటు ఆఫీసు అద్దెలు 8.6 శాతం పెరిగి నెలకు చదరపు అడుగుకు 8.6 డాలర్లకు చేరుకున్నాయి. మయామిలో ఆఫీసు అద్దె 2024లో 7.3 శాతం పెరిగి నెలకు చదరపు అడుగుకు 5.1 డాలర్లకు చేరుకోగా, బోస్టన్లో 1.2 శాతం పెరిగి నెలకు 5.5 డాలర్లకు చేరుకుంది. సింగపూర్లో సగటు ఆఫీసు అద్దె 2024లో 0.5 శాతం పెరిగి నెలకు చదరపు అడుగుకు ఏడు డాలర్లకు చేరుకుంది.